ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.5 శాతం అధిక వృద్ధి

భారత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చినపుడు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.5 శాతం అధిక వృద్ధి నమోదైంది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఇది 4.1 శాతం ఉండేది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చినపుడు 13.5 శాతం అధిక వృద్ధి రేటు నమోదైంది.
 
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. 
ధర తగ్గిన వంట గ్యాస్​ సిలిండర్ 
ఇలా ఉండగా, వంట గ్యాస్​ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో రూ.91.50 తగ్గింది. గురువారం  నుంచి  ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్‌ సిలిండర్ల  ధరలో ఎలాంటి మార్పు లేదు.
తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది.  అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే.