శరవేగంగా శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణ పనులు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని నిర్మితమవుతున్న శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆలయంలో రామ్‌లల్లా ఎప్పుడు దర్శనం ఇస్తాడని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో  గర్భాలయంకు చెందిన  కొన్ని ఫొటోలను ట్రస్ట్ బోర్డు విడుదల చేసింది. 

గర్భ గృహానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూన్ లో శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా గర్భగృహంలో రాళ్లు ఉంచే వేడుకలో ఆయన భాగస్వామ్యం అయ్యారు.  2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ గర్భగుడిని భక్తుల కోసం తెరుస్తారు.

కాగా రామాలయ నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు ఆగస్టులో తెలిపారు. ఏకకాలంలో ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణాన్ని గర్భగుడి ప్రాంతం నుండి ప్రారంభించామని రామజన్మభూమి ట్రస్ట్‌లో పనిచేస్తున్న పర్యవేక్షక చీఫ్ ఇంజనీర్లు జగదీష్ తెలిపారు. ఆలయ గోడలకు రాజస్థాన్‌కు చెందిన గులాబీ రంగు ఇసుకరాయిని ఉపయోగిస్తున్నారు.

ఈ ప్లింత్‌లో ఉపయోగించిన రాళ్లను ఎత్తడానికి భారీ క్రేన్‌లను ఉపయోగించారు.రామాలయం గర్భగుడిలో ఉపయోగిస్తోన్న తెల్లటి పాలరాతిని రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తెచ్చినట్టు ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రామజన్మభూమి ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ గర్భగుడి కోసం 6.37 లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్, 4.70 లక్షల క్యూబిక్ అడుగుల చెక్కిన గులాబీ ఇసుకరాయి,13,300 క్యూబిక్ అడుగుల మక్రానా తెలుపు రంగులో ఉన్న చెక్కిన పాలరాయిని ఉపయోగించనున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది.

2020 ఆగస్టులో అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం నిర్వహించిన ‘భూమి పూజ’, శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇక క్యూబిక్ ఆకారంలో నిర్మితమవుతోన్న భగవాన్ వాల్మీకి ఋషి, కేవత్, మాతా శబరి, జటాయు, మాతా సీత, విఘ్నేశ్వర్ (గణేష్), శేషావతార్ (లక్ష్మణ్) ఆలయాలు కూడా ప్రణాళికలో ఉన్నట్టు సమాచారం.