లో దుస్తులు తొలగించిన విద్యార్థునులకు మరోసారి నీట్ పరీక్షలు 

మెడికల్‌ విద్యనభ్యసించేందుకు నిర్వహించిన నీట్‌ పరీక్షకు హాజరైన సమయంలో లో దుస్తులు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినుల పట్ల నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ లో దుస్తులు తొలగించారని ఆరోపించిన విద్యార్థినుల కోసం నీట్‌ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. 
 
సెప్టెంబర్‌ 4న ఆ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నామని, ఇదే విషయాన్ని సదరు యువతులకు మెయిల్‌ ద్వారా తెలియజేసింది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు తమ లో దుస్తులు తొలగించాలని అక్కడి సిబ్బంది అడగటంపై తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. 
తనిఖీల సమయంలో లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని, దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్ష కేంద్రం లోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహాలో ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది.
విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
దీనిపై సెక్షన్‌ 354, 509 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  ఈ కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు కళాశాల సిబ్బందితో పాటు అక్కడి భద్రతను అప్పగించిన ఏజెన్సీకి చెందిన ముగ్గురు ఉన్నారు. తర్వాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు.