సబర్మతి నదిపై `అటల్ బ్రిడ్జి’  ప్రారంభించిన ప్రధాని 

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో సబర్మతి నదిపై నిర్మించిన ‘అటల్​ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మొదటి రోజు 300 మీటర్ల పొడవైన అటల్​ బ్రిడ్జిని ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలను ట్విటర్​లో ఆయన షేర్​ చేశారు.

‘‘బ్రిడ్జి అద్భుతంగా కనిపిస్తోంది కదా!. సబర్మతి నదిపై నిర్మించిన అసాధారణమైన ల్యాండ్​మార్క్​ఈ అటల్​ బ్రిడ్జి” అని మోదీ  ట్వీట్​ చేశారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయి పేరును ఈ బ్రిడ్జికి పెట్టారు.

అహ్మదాబాద్​ మునిసిపల్​ కార్పొరేషన్​ సబర్మతి నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించింది. ఇది పూర్తిగా ఫుట్​ఓవర్​ బ్రిడ్జి. అంటే నడిచేందుకు మాత్రమే దీనిని కట్టారు. ఎల్లిస్​ బ్రిడ్జి, సర్దార్ బ్రిడ్జిల మధ్య ఈ అటల్​ వారధిని నిర్మించారు. దీని పొడవు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. 2,600 మెట్రిక్​ టన్నుల స్టీల్​ పైపులు వాడి ఈ వారధి కట్టారు.

బ్రిడ్జి రూఫ్​ను రంగురంగుల ఫ్యాబ్రిక్​తో తీర్చిదిద్దారు. రెయిలింగ్​ను గ్లాస్​, స్టెయిన్ లెస్​ స్టీల్​తో నిర్మించారు. రివర్​ ఫ్రంట్​లోని పశ్చిమాన ఉన్న ఫ్లవర్​ గార్డెన్​ను తూర్పున త్వరలో నిర్మించే ఆర్ట్స్​ అండ్ కల్చర్​ సెంటర్​తో ​ఈ బ్రిడ్జి కలుపుతుంది.

పాదచారులతో పాటు సైక్లిస్టులు కూడా నదిని దాటేందుకు, ట్రాఫిక్​ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ వారధిని వాడుకోవచ్చు. అలాగే బ్రిడ్జిపై నిలబడి నది మధ్యలో నుంచి నదిని, పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. లోయర్, అప్పర్​ వాక్​వేస్​ల నుంచి చేరుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు.

‘అటల్ బ్రిడ్జి’ అత్యాధునికత సాంకేతికత, డిజైన్ ఔన్నత్యానికి నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.  గుజరాత్ ప్రజలు ఎప్పుడూ ప్రేమించే, గౌరవించే శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ వంతెన నివాళి అని ఆయన తెలిపారు.

“అటల్ వంతెన సబర్మతి నది యొక్క రెండు ఒడ్డులను అనుసంధానం చేయడమే కాదు, ఇది డిజైన్, ఆవిష్కరణలలో కూడా అపూర్వమైనది. గుజరాత్‌లోని ప్రసిద్ధ గాలిపటాల ఉత్సవం దాని రూపకల్పనలో కూడా జాగ్రత్త తీసుకోబడింది” అని ఆయన చెప్పారు.

‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్న ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి మోదీ చరఖా చేతబట్టి నూలు వడికారు.  గుజరాత్ లో పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన ‘ఖాదీ ఉత్సవ్’ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు చరఖా తిప్పుతూ.. నూలు దారాన్ని తీసుకుని వ‌డికారు.

అనంతరం ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్న నేతకార మహిళతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశానికి నేతన్నలు చేస్తున్న మేలును గుర్తుచేసుకుని, వారి సేవలను కొనియాడారు. ఇంటిల్లిపాది నూలు వడికి కష్టపడే తీరు ఇతరులకు ఆదర్శవంతమని మోదీ తెలిపారు. “75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, 7,500 మంది సోదరీమణులు, కుమార్తెలు కలిసి రాట్నంపై నూలు వడకడం ద్వారా చరిత్ర సృష్టించినందున సబర్మతీ ఒడ్డు ఈ రోజు ధన్యమైంది.” అంటూ చరఖాపై తిప్పడం ఆరాధనకు తక్కువ కాదని ప్రధాని స్పష్టం చేశారు. 

“ఖాదీ దారం స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిగా మారిందని, అది బానిసత్వం  గొలుసులను తెంచిందని చరిత్ర సాక్ష్యమిస్తుంది” అని మోదీ గుర్తు చేశారు. నేడు అదే ఖాదీదారం అభివృద్ధి చెందిన భారతదేశ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, తద్వారా స్వావలంబన భారతదేశపు కలను నెరవేర్చడానికి ప్రేరణగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాదీ వంటి సంప్రదాయ బలం మనల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే చేనేత విశిష్టత.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దిగజారిందని.. నాసిరకం ఉత్పత్తిగా పరిగణిస్తున్నారని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. చేనేతతో అనుబంధం ఏర్పరచుకున్న గ్రామీణ పరిశ్రమ నాశనం కావడమే దానికి కారణమని చెప్పారు.