180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్‌’ రైలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్‌ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ మూడో ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు అధికారులు.

ఈ ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి ఔరా అనిపించింది. ట్రయల్‌ రన్‌లో రైలు వేగాన్ని చూపుతున్న వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.భారత్ లో ఇంత వేగంతో దూసుకెళ్లిన రైలు ఇప్పటివరకు లేదు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.

019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ- వారణాసి మధ్య దీన్ని నడుపుతున్నారు. ఢిల్లీ- జమ్మూలోని వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా- మధ్యప్రదేశ్‌లోని నగ్దా మధ్య మూడో రైలు నడపనున్న నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది ట్రైను.

రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌ చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా  పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం.

గంటకు 180 కిమీ వేగంతో వెళుతున్నా రైలు బోగీ అద్దం నిలకడగా ఉందని, ఆ వేగానికి ఎక్కడా అదిరిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నీళ్లతో ఉన్న గ్లాసు కూడా కనిపిస్తోంది. అందులోని నీరు ఎక్కడా తొణకకపోవడం వందే భారత్ రైలు బోగీల పటిష్ఠతను చాటుతోంది.