కాంగ్రెస్ లో కేవలం గాంధీలు మాత్రమే మిగులుతారు 

కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నవారు వదిలి వెళ్లిపోతున్నారని, ఆ పార్టీలో కేవలం గాంధీలు మాత్రమే మిగిలే రోజులు వస్తాయని తాను గతంలో చెప్పిన జోస్యం  ప్రకారమే ఇప్పుడు జరుగుతోందని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 

తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌లో తాను నిర్వహిస్తున్న అన్ని పదవులకు, పార్టీకి రాజీనామా చేసి, సుదీర్ఘమైన లేఖను రాసిన నేపథ్యంను ప్రస్తావిస్తూ నిజానికి రాహుల్ గాంధీ బీజేపీకి వరం వంటివారని ఆయన ఎద్దేవా చేశారు. 

2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ  తాను రాసిన రాజీనామా లేఖను, ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ రాసిన రాజీనామా లేఖను పరిశీలిస్తే, అనేక సారూప్యతలు కనిపిస్తాయని శర్మ తెలిపారు. రాహుల్ గాంధీ అపరిపక్వతగల నేత అని కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని పేర్కొన్నారు. 

సోనియా గాంధీ పార్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఆమె కేవలం తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికే చూస్తున్నారని తెలుపుత అది నిష్ఫల యత్నమని ఆయన స్పష్టం చేశారు.

జమ్ములో కాంగ్రెస్‌‌కు ఎదురు దెబ్బలు

 
ఆజాద్ పార్టీకి రాజీనామాతో జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ పరిస్థితి దమనీయంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆజాద్ రాజీనామా చేసిన కొద్దీ  సేపటికే జమ్మూ కశ్మీర్ కు చెందిన మరో ఐదుగురు నేతలు రాజీనామా చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా ఆజాద్ కు మద్దతుగా రాజీనామా చేసినట్లు రాజీనామా చేసిన లేఖలో వెల్లడించారు. 
 
ఆజాద్ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ నేతల్లో జీఎం సరూరి, హజి అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఆమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాని, చౌదరి మహ్మద్ అక్రమ్ ఉన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ఎస్‌ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక జెకెపిసిఅధ్యక్షుడు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారని జీఎం సరూరి ఎద్దేవా చేశారు.