జార్ఖండ్ సీఎంకు సొరేన్ శాసనసభ సభ్యత్వం రద్దు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్  రమేశ్ బాయిస్  రద్దు చేశారు.  ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫార్సుతో గవర్నర్ రమేశ్ బాయిస్ చర్యలు తీసుకున్నారు   దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు.

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్లు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది.ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా సోరెన్‌ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

గత సంవత్సరం స్టోన్ మైనింగ్ లీజు కేటాయింపులో తన పదవిని దుర్వినియోగం చేశారంటూ సోరెన్ ను దోషిగా తేల్చారు. రాంచీలోని అంగడాలో సోరెన్ తన పేరు మీద మైనింగ్ లీజు తీసుకున్నారని 2022 ఫిబ్రవరిలో బీజేపీ ప్రతినిధుల బృందం ఆరోపించింది. ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత కొద్దిరోజులుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది.

దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో  విచారించిన ఎన్నికల సంఘం.. హేమంత్ సోరెన్ కు సంబంధించిన లీజులు, షెల్ కంపెనీల్లో ఆయన, ఆయన సన్నిహితుల వాటాలను తేల్చింది. ఆరోపణలు రుజువు కావడంతో ఆయన సభ్యత్వ రద్దుకు గవర్నర్ కు సిఫార్సు చేసింది.