ఉచిత హామీలపై `సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడంపై ఇటీవల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తమ పదవీకాలం పూర్తిచేసుకోబోతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ  తన విధి నిర్వహణలో భాగంగా చివరి రోజున (శుక్రవారం) కీలక తీర్పు ఇచ్చారు. 
 
ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అఖిలపక్షం, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. 2013 తీర్పు పున: పరిశీలనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. కొత్త సీజేఐ త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని సీజేఐ తెలిపారు.  అఖిలపక్షం, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది.
 
తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. ఉచితాలపై ప్రజా హిత వ్యాజ్యం దాఖలు చేసి ప్రజా ప్రయోజనాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాదులకు సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను  గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ విశేష సేవలు అందించారు. న్యాయవాది నుంచి సీజేఐ స్థాయికి జస్టిస్‌ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. 
 
13 ఏళ్లు ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా ఆయన పనిచేశారు. సుప్రీంకోర్టు సీజేఐగా 2021 ఏప్రిల్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘ కాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ రికార్డు సృష్టించారు.