భారత్ లో పెద్ద ఉగ్ర కుట్రను విఫలం చేసిన భద్రతా దళాలు

భారత్‌లో పెద్ద ఉగ్ర కుట్ర విఫలమైంది. ఓ పాకిస్తాన్‌ ఉగ్రవాదిని  పట్టుకోగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గత రెండు రోజుల్లో పలువురు ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. ఓ ఉగ్రవాది భద్రతా సిబ్బందికి దొరికిపోయారు. 
 
ఆగస్టు 21 తెల్లవారు జామున నౌషెరా ప్రాంతంలోని ఝంగర్‌ సెక్టార్‌లో  నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు గమనించాయి. వారిలో ఒకరు కంచెను కత్తిరించేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడి చేసి పట్టుకున్నాయి.
 
 పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరపడంతో  ఒకరిని పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు పాక్‌ ఆక్రమిత భూభాగంలోకి పారిపోయారు. కాల్పుల జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి జిల్లాలోని సబ్‌కోట్‌ గ్రామ నివాసి తబారక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. 
 
పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన కల్నల్‌ యూసఫ్‌ చౌదరి తనను పంపినట్లు అంగీకరించాడని సైన్యం చెబుతోంది. ఆయన తనకు రూ.30 వేలు ఇచ్చి భారత్‌లో ఉగ్రదాడి జరపమని చెప్పినట్లు పేర్కొన్నాడని సైన్యం పేర్కొంది.

కాగా, 2016లో తబారక్‌ హుస్సేన్‌ సోదరుడు హరూన్‌ అలీతో కలిసి చొరబడేందుకు ప్రయత్నించగా భారత్‌ సైన్యం పట్టుకుని, 2017 నవంబర్‌లో మానవతా కారణాలతో స్వదేశానికి పంపించేశారు. అయితే అతడు తిరిగి భారత్‌లో ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించాడు. 

 ఈ నెల 22న లామ్‌ సెక్టార్‌ వద్ద మరో ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే భారత ఆర్మీ అమర్చిన మందు పాతర పేలి ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. వారి వద్ద నుండి ఎకె -56 రైఫిల్స్‌తో పాటు బుల్లెట్లు లభించాయి.
ముగ్గురు చొర‌బాటుదారుల‌ కాల్చివేత్త 
ఇలా ఉండగా, పాకిస్థాన్ భూభాగం నుంచి జమ్మూ కశ్మీర్ లోకి చొరబడాలన్న ఉగ్రవాదుల పన్నాగాన్ని భారత భద్రతా బలగాలు వమ్ముచేశాయి. యూరీ సెక్టార్లోని కమాల్ కోటే వద్ద ముగ్గురు చొరబాటుదారులను భారత జవాన్లు కాల్చి చంపారు. 
 
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కి సమీపంలో మదియాన్ నానక్ పోస్టు వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. భారత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులు మరణించడంతో చొరబాటు యత్నం భగ్నమైంది. 
 
దీనికి సంబంధించిన వివరాలను కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో కశ్మీర్ సరిహద్దుల వ్యాప్తంగా చొరబాట్లు పెరిగాయి. 2018 నుంచి 2021 వరకు 366 చొరబాటు యత్నాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో పార్లమెంటుకు తెలిపింది.  2004లో కేంద్రం 740 కిలోమీటర్ల పొడవైన ఎల్ఓసీ వద్ద 550 కిలోమీటర్ల మేర కంచెను నిర్మించింది. అయినా చొర‌బాటు దారుల ఆగ‌డాలు త‌గ్గ‌ట్లేదు.

సరిహద్దు ప్రాంతంకు ఉగ్రవాద శిబిరాలు 

మరోవంక, పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తమ అడ్డాలను భారత సరిహద్దుల సమీపానికి మార్చాయి. ఇంతకాలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని పెషావర్‌, బహవల్‌పూర్‌, ముజఫరాబాద్‌, మన్షేరా, కోట్లీ కేంద్రాలుగా ఉన్న జైషే మహమ్మద్‌ (జేఈఎం), లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తదితర ఉగ్రసంస్థలు తమ శిబిరాలను లాంచ్‌ప్యాడ్లతో సహా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కు కొన్ని కిలోమీటర్ల దూరానికి మార్చాయి.