సెప్టెంబర్ 2న స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్ జలప్రవేశం

స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్ సెప్టెంబర్ 2 న జలప్రవేశం చేయనున్నది. భారత్ స్వదేశీయంగా నిర్మించిన మొదటి విమాన వాహక యుద్ధ నౌక ఐఎస్‌ఎస్ విక్రాంత్ ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించడంలో కీలక పాత్ర వహిస్తుందని ఇండియన్ నేవీ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఎస్‌ఎస్ ఘోర్మడే తెలిపారు.
ఈ నౌక నుంచి కొన్నేళ్లు మిగ్ 29 కె జెట్స్ ఆపరేట్ చేయడమౌతుందని పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 88 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పతి చేస్తుంది, ఇందులో 2,300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని, 1,700 మంది సిబ్బంది పనిచేస్తారని తెలిపారు.
సుమారు 30 యుద్ధవిమానాలను మోసే సామర్థ్యం ఉన్న ఐఎన్‌ఎస్‌ ప్రారంభంతో హిందూ మహాసముద్రం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి భద్రతల స్థిరత్వం పెరుగుతుందని చెప్పారు. నవంబర్‌ నుంచి ల్యాండింగ్‌ పరీక్షలు ప్రారంభిస్తామని, ఇవి వచ్చే ఏడాది మధ్యనాటికి పూర్తవుతాయని తెలిపారు. వచ్చే ఏడాది చివరి నుంచి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 2 న కొచ్చిలో ఐఎస్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరుగుతుందని చెప్పారు. సుమారు 40 వేల టన్నులకు పైగా బరువున్న యుద్ధ నౌకల్ని తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరేలా మోదీ ప్రోత్సహించారని పేర్కొన్నారు. అంతేకాక భారత్ ఐక్యత, వైవిధ్యం దీనివల్ల ప్రతిబింబిస్తుందని ఘోర్మడే తెలిపారు.
విక్రాంత్ యుద్ధ నౌక కోసం కోల్‌కతా, జలంధర్, కోట, పుణె, అంబాలా, హైదరాబాద్ , ఇండోర్ తదితర 18 రాష్ట్రాల నుంచి పరికరాలు  అందాయని చెప్పారు. భారత్‌లో ఇది మరువరాని రోజు అవుతుందని, రక్షణ పరికరాల తయారీలో భారత్ స్వయం సామర్థ్యం దీని ద్వారా ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.