సంజయ్ అరెస్ట్ పై జెపి నడ్డా ఆగ్రహం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తమ పార్టీకి లభిస్తోన్న మద్దతు చూసి కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీకి లభిస్తున్న మద్దతు చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని జేపీ నడ్డా ఆయన విమర్శించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసీఆర్‌కు చరమగీతం పాడుతామని  స్పష్టం చేశారు.
 
నేడు బిజెపి నిరసనలు 

 
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు నిరసనగా బీజేపీ బుధవారం ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘‘నిరసన దీక్ష’’ చేపట్టాలని నిర్ణయించింది.  రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలతోపాటు రాష్ట్ర రాజధానిలో జరిగే నిరసన దీక్షలో బీజేపీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. 
 
 అందులో భాగంగా గ్రుహ నిర్భంధంలోనున్న బండి సంజయ్ కుమార్ సైతం ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లోనున్న తన నివాసంలో ‘‘నిరసన దీక్ష’’ చేపడుతున్నారు. 
అట్లాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొంటారు.
 
లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుని బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారనే అంశాన్ని ఈ నిరసన దీక్ష సందర్భంగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
 
ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతం అవుతూ ఉండడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనకు నిదర్శనమనే సంకేతాలను సైతం మరోసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది.