సంజయ్ యాత్రకు అనుమతికై డిజిపిని ఆదేశించండి గవర్నర్

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కు బిజెపి తెలంగాణ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. 
 
బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జి వెంకటస్వామి, విజయశాంతి, ఈటెల రాజేందర్, ఎపి జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావులతో కూడిన ప్రతినిధి వర్గం గవర్నర్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. 
 
 సోమవారం హైదరాబాద్ లో బిజెపి కార్యకర్తలపై పోలీసులు, టిఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన జరిపిన దాడిపై విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం జనగాంలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఘటనపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

 
బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.  టీఆర్ఎస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై యాత్ర చేస్తున్న బిజెపి కార్యకర్తలను టీఆర్ఎస్ రెచ్చగొట్టేందుకు ఎంతలా ప్రయత్నించినా, బిజెపి కార్యకర్తలు సంయమనం పాటించారని వారు గవర్నర్ కు తెలిపారు.
 రెండో విడత యాత్రలో గద్వాల్ జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారని వారు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ కంచుకోటలుగా భావిస్తున్న ప్రాంతాల్లో యాత్రకు అపూర్వ స్పందన వస్తుండడంతో ఏదో ఒక సాకుతో యాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు.
 
జనగాం జిల్లా దేవరుప్పల గ్రామంలో యాత్రపై దాడి జరిగినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారని, దుండగులకు మద్దతుగా నిలిచారని బిజెపి నాయకులలు పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటి ముందు ధర్నా చేసిన బిజెపి కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాల దాడిలో పలువురు బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు.
 
తప్పుడు కేసుల్లో 26 మంది బిజెపి నేతలపై జ్యుడీషియల్ కస్టడీ విధించారని పేర్కొంటూ యాత్రపై దాడి చేసేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 నుంచి 5 వేల మందిని సమీకరించినట్టు సమాచారం ఉందని వారు గవర్నర్ కు వివరించారు. యాత్రకు వస్తున్న బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని చెబుతూ యాత్రపై దాడి చేయాలని సీఎంఓ నుంచే ఆదేశాలు వెళ్లినట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించారు.
‘కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాదయాత్రపై దాడులు చేయిస్తున్నారు’ అని డా. లక్ష్మణ్ గవర్నర్ ను కలసిన అనంతరం ధ్వజమెత్తారు.
 పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా ఎమ్మెల్సీ కవితపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. టీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు.  పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి. జరిగిన ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.