పరువు నష్టం కేసులో సిసోడియాకు అస్సాం కోర్టు సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అస్సాం కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి సెప్టెంబర్ 29న తమ ముందు హాజరుకావాలని కమ్రూప్ కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సిసోడియాను ఆదేశించింది. అస్సాం సీఎం సిసోడియాపై  జూలై 1న పరువు నష్టం దావా వేశారు.

2020లో హిమంత బిస్వా శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న టైమ్ లో  పీపీఈ కిట్ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌లో అవతవకలు జరిగాయని సిసోడియా ఆరోపించారు. అధిక ధరలకు ఈ కాంట్రాక్ట్‌ను ఆయన భార్యకు చెందిన కంపెనీకి ఇచ్చినట్లు సిసోడియా పేర్కొన్నారు.

మార్కెట్ లో తక్కువ ధర ఉన్నప్పటికీ ఒక్కో కిట్‌కు రూ. 990 అధిక ధరను చెల్లించారని, అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని సిసోడియా పేర్కొన్నారు. అయితే సిసోడియా చేసిన ఆరోపణను ఖండించిన హిమంత బిస్వా శర్మ  దంపతులు అనంతరం సిసోడియాపై  శర్మ  పరువునష్టం కేసు వేశారు. 

ఇలా ఉండగా, ఇప్పటికే ఢిల్లీ మద్యం స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో మనీశ్ సిసోడియాను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపి కృష్ణను, మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీలను సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది.

ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు. గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.