కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహితం కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధం!

తమ్ముడు రాజగోపాల్ రెడ్డి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి  బీజేపీలో చేరగా, అదే బాటలో అన్న, లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహితం ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 
 
తమ్ముడు రాజీనామాతో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల  వ్యూహం గురించి చర్చించేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో ప్రియాంక గాంధీ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశానికి గైరాజరు కావడం ద్వారా ఆ మేరకు సంకేతం ఇచ్చినట్లయింది. 
 
ఢిల్లీలోనే ఉంది, ఉదయం ఓ పార్లమెంటరీ కమిటీ సమావేశంకు కూడా హాజరై సాయంత్రంకు హైదరాబాద్ కు తిరిగి రావడం గమనార్హం. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డిలతో పాటు ఇతర సీనియర్ నాయకుల మధ్య బేధాభిప్రాయాలు ప్రియాంక సర్దిచెప్పి, ఉమ్మడిగా పనిచేసే మార్గం అన్వేషిస్తారని అందరూ ఆశించారు. 
 
అయితే రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తూ ఈ సందర్భంగా సోనియా గాంధీకి ఆయన లేఖ వ్రాసారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నరసింహ తదితరులంతా హాజరయ్యారు.
అంతకు ముందు సోనియా గాంధీకి వ్రాసిన లేఖలో ఈ సమావేశంపై హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ రాసుకొచ్చారు.
చండూరు‌లో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబంపై చేసిన కామెంట్స్‌ను పేర్కొన్న వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి‌తో వేదిక పంచుకోలేనని తేల్చి చెప్పారు.
 
‘రేవంత్‌ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్‌ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణికం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్‌ లాంటి వాళ్లకు ఇన్‌ఛార్జ్‌గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు.
 
వాస్తవానికి కొంతకాలంగా వెంకట్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  తమ్ముడు చేరి, ఉపఎన్నికకు సిద్ధం కావడంతో. తాను సహితం ఇక ఆలస్యం చేయరాదని వెంకట్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే అమిత్‌షాతో పాటు బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్న ఆయన ఇక బీజేపీలో చేరడం ఉత్తమమని భావిస్తున్నట్లు సన్నిహితులు భావిస్తున్నారు.