ముస్లిం మంత్రితో ఆలయ గర్భ గుడిలో నితీష్ పూజలపై దుమారం 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ముస్లిం మంత్రితో కలిసి గయలోని  విష్ణుపద్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. నితీష్ కుమార్‌ను తప్పుపడుతూ బీజేపీ విమర్శలు గుప్పించింది.

గయలో మంగళవారం అధికార పర్యటనకు వెళ్లిన నితీ‌ష్ కుమార్ తనతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరిని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు. అనంతరం మన్సూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

కాగా, హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని, అయినప్పటికీ  ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

ఈ ఘనటపై బీజేపీ ఎమ్మెల్యే థాకూర్ బచౌల్ మండిపడ్డారు. ఇది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. హిందూయేతరులకు ఆలయ ప్రవేశంపై నిషేధం ఉందని స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆయన (మన్సూరి) దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన బేఖాతరు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీ  ఓబీసీ విభాగం జాతీయ ప్రధాదర్శిన  నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను నితీష్ గాయపరచిచారని, ఆలయ వ్యవస్థను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించే వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఒక ముస్లిం మంత్రితో నితీష్ ఆలయంలోకి అడుగుపెట్టారని పేర్కొంటూ సీఎంకు హిందూ ధర్మం, సాంప్రాదాయాలపై ఎలాంటి నమ్మకం లేదని మండిపడ్డారు.

సెక్యులర్‌వాదంపై ఆయనకు అంతగా నమ్మకం ఉంటే మక్కాకో, మదీనాకో వెళ్లి నమాజ్ చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. స్థానిక పూజారుల ఆచరించే పద్దతులు, పురాతన మత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసేందుకు నితీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసాలు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ నితీష్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ముస్లింలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు గర్హనీయమని ధ్వజమెత్తారు.