మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్ తప్పదా!

పాకిస్థాన్ లోని ప్రధాన దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఎ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత నిధుల సంబంధిత కేసులో ఇమ్రాన్‌ఖాన్ తమ నోటీసులకు అనుగుణంగా హాజరుకాకపోవడం, పైగా వీటిని తిట్టిపోయడంపై ఈ దర్యాప్తు సంస్థ తీవ్రస్థాయిలో స్పందించనుంది.
మాజీ ప్రధానిని ఏ క్షణం అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని శనివారం ది న్యూస్ పత్రిక తెలిపింది. శుక్రవారం ఖాన్‌కు ఈ దర్యాప్తు సంస్థ రెండో నోటీసు వెలువరించింది. అయితే దీనిని కూడా ఆయన బేఖాతరు చేశారు. దర్యాప్తు బృందం ఎదుట తాను హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మూడు నోటీసుల తరువాత అరెస్టుపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్‌ఖాన్ పిటిఐ పార్టీ కి చెందిన ఐదు కంపెనీలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, బెల్జియంలలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కనుగొంది.
 
వీటి గురించి పార్టీ వర్గాలు ఎన్నికల సంఘానికి అందించిన సమాచారంలో ప్రస్తావించలేదని, ఇది నిషేధిత నిధుల అక్రమ వ్యవహారంగా ఉందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. మూడో నోటీసుకు స్పందించకపోతే తదుపరి చర్య ఉంటుందని తెలిపింది. 
 
అయితే దర్యాప్తు సంస్థకు ఈ అంశంపై వివరణ ఇచ్చుకునే బాధ్యత తనకు లేదని, ఇవ్వదల్చుకోలేదని, వెంటనే నోటీసులు వెనకకు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లతానని ఇమ్రాన్ దర్యాప్తు సంస్థకు హెచ్చరికలు వెలువరించారు.