జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్ గెల్చుకున్న భారత్

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య  జట్టుపై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 162 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ సేన..25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.  భారత బ్యాట్స్మన్లలో సంజూ శాంసన్ 43 పరుగులతో రాణించగా..ధావన్, శుభమన్ గిల్ 33 పరుగుల చొప్పున చేసి పర్వాలేదనిపించారు. దీపక్ హుడా 25 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో ల్యూక్ జాంగ్వే రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 
 
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-0తో దక్కించుకుంది. సిరీస్లో మూడో వన్డే ఈ నెల 22న జరగనుంది.  అంతకుముందు టాస్ ఓడి  బ్యాటింగ్కు దిగిన అతిథ్య జట్టు..భారత బౌలర్ల ధాటికి కేవలం 38.1 ఓవర్లలో 161 పరుగలకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచి ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది.
20 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన జింబాబ్వే..27 రన్స్ వద్ద రెండో వికెట్ నష్టపోయింది. మరో రెండు పరుగుల వ్యవధిలో 29 పరుగుల వద్ద కెప్టెన్ చకబ్వాను శార్దూల్ ఠాకూర్ పెవీలియన్ పంపాడు. ఆ తర్వాత 31 పరుగుల వద్ద మదివెరెను ప్రసిద్ధ కృష్ణ బుట్టలో వేసుకున్నాడు.
దీంతో జింబాబ్వే 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సికిందర్ రజా, సీన్ విలియమ్స్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే రజాను ఔట్ చేసిన కుల్దీప్ .. వీరిద్దరి భాగస్వామ్యాన్ని  విడగొట్టాడు.
ఆ తర్వాత విలియమ్స్ 42 పరుగులు, ర్యాన్ బురీ 39 పరుగులతో రాణించినా..మిగతా వారి నుంచి సహకారం కరువైంది. చివరకు జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా..సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్, దీపక్ హుడా తలో ఓ  వికెట్ పడగొట్టారు.