అమెరికా వీసాలకు ఏడాదిన్నర వరకు జాప్యం తప్పదా!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా కష్టాలు ఎదురుకానున్నాయి. పర్యాటక వీసా, స్టూడెంట్‌ వీసాలు రావాలంటే ఏడాదిన్నరకు పైగా వేచి చూడాల్సి రానుంది. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ కోసం 500ల రోజులకు పైగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
 భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్‌కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటుంది. 
 
అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్‌ చేస్తుంటుంది. భారత్‌లో న్యూఢిల్లీ ఎంబసీతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు(వర్చువల్‌గా) కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది.
 
అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ సమయం భారీగా ఉందన్న విషయంపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ ఇమ్మిగ్రెంట్‌తోపాటు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా వీసాలు జారీ చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. 
 
కరోనా వైరస్‌ విజృంభణ  సమయంలో లాక్‌డౌన్‌ తోపాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది. మెడికల్‌ ఎమర్జెన్సీ, అంత్యక్రియలు, పాఠశాలల ప్రారంభం వంటి అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలనుకునే వారికి ఇంటర్వ్యూను వీలైనంత త్వరగా చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని, అయినా ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది.