బాంగ్లాదేశ్ హిందూవులు తమను తాము మైనారిటీలుగా భావించొద్దు 

బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ  హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని, ఆత్మా విశ్వాసం పెంపొందింప చేసుకోవాలని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా  హితవు చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ సమాన హక్కులను అనుభవించవచ్చునని ఆమె తెలిపారు. అయితే ఏదైనా చిన్న దాడి జరిగినపుడు దేశంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయవద్దని హితవు పలికారు.
 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకేశ్వరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వర్చువల్ విధానంలో పాల్గొంటూ అన్ని మతాలవారూ సమాన హక్కులతో జీవించాలని తాము కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌ పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.
బాంగ్లాదేశ్ లౌకిక దేశంగా, అన్ని మతాలవారికి సమాన హక్కులు ఉండేటట్లు ఉండాలని బంగ్లాబంధు షేక్ ముజాబూర్ రహమాన్ కోరుకున్నారని ఆమె గుర్తు చేశారు. 1975లో జాతిపిత హత్యకు గురైనప్పుడు హిందూవులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆమె చెబుతూ ఎందుకంటె అప్పటి ప్రభుత్వం బాంగ్లాదేశ్ ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలని భావించిందని ఆమె మండిపడ్డారు. అయితే, ప్రజలు నుండి వత్తిడి రావడంతో వారావిధంగా చేయలేక పోయారని ఆమె తెలిపారు.
“నాకు ఉన్న హక్కులే మీకు కూడా ఉన్నాయి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు’’ అని కోరారు. అందరూ ఇదే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలిగితే, ఏ మతంలోని దుష్టశక్తులైనా సరే దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించలేవని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని, ఐకమత్యాన్ని పదిలపరచుకోవాలని సూచించారు. ‘‘మీ అందరి నుంచి ఇదే కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.
బంగ్లాదేశ్‌లోని ఓ వర్గం హిందువులపై పీఎం హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఓ విషయాన్ని నేను చాలా విచారిస్తూ చెప్తున్నాను. దేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా, దేశంలోనూ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని పెద్ద ఎత్తున చెప్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతూ చర్య తీసుకున్నప్పటికీ దేశంలో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ చర్యల గురించి తెలియడంలేదని ఆమె వాపోయారు. దేవాలయాలను కాపాడటం కోసం పోలీసులు జరిపే కాల్పుల్లో ముస్లింలు చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో కానీ, కోల్‌కతాలో కానీ ఏర్పాటు చేసే దుర్గా పూజా మండపాల కన్నా ఢాకాలో ఎక్కువ మండపాలు ఉంటున్నాయని హసీనా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో దుర్గా పూజలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారని ఆమె తెలిపారు. తన ప్రభుత్వం మసీదుల ఆధునికీకరణ, మరమ్మతులకు మాత్రమే కాకుండా దేవాలయాలు, చర్చిలు, మఠాల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం కూడా చర్యలు తీసుకుంటోందని ఆమె భరోసా ఇచ్చారు.
మతపరమైన మనోభావాలను గాయపరచడం సరైన విషయం కాదని ఆమె తెలిపారు.  దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరిగాయని పేర్కొంటూ. సమస్యలను సృష్టించే ఓ వర్గం అన్ని మతాల్లోనూ ఉందని ఆమె హెచ్చరించారు. ఏ మతస్థులనైనా అణగదొక్కాలని తమ ప్రభుత్వం, అవామీ లీగ్ పార్టీ కోరుకోబోవని ఆమె స్పష్టం చేశారు.