శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక  ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న చైనా నడుపుతున్న ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.  

కానీ అది ఆలస్యంగా చేరుకుని అక్కడ తిష్టవేసింది. దీనిపై భద్రతాపరమైన ఆందోళనలను శ్రీలంకతో  భారత్ లేవనెత్తింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హంబన్‌తోట ఓడరేవు వద్ద తిష్ట వేసిన వివాదాస్పద  హైటెక్ చైనా పరిశోధన నౌక  ఆరు రోజుల పర్యటన తర్వాత సోమవారం శ్రీలంక జలాల నుండి బయలుదేరింది.

చైనా ఓడ ఆగస్ట్ 16న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:20 గంటలకు దక్షిణ శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవుకు చేరుకుంది. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది.

యువాన్‌ వాంగ్‌ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్‌ యిన్‌ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్‌ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు.

దీని తదుపరి ‘పోర్ట్ కాల్’ చైనాలోని జియాంగ్ యిన్ పోర్ట్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు. నౌక పర్యటన సందర్భంగా ఇక్కడి చైనా రాయబార కార్యాలయం కోరిన అవసరమైన సహాయాన్ని శ్రీలంక అందించింది. హంబన్‌తోట నౌకాశ్రయానికి నౌక రావడం వివాదాస్పదంగా మారింది.

తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థ స్విఛాన్‌ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించింది.

కొలంబో  అప్పులు చెల్లించడంలో విఫలమైన తర్వాత చైనా 2017లో శ్రీలంక నుండి ఓడరేవును 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. నగదు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి ముందస్తు బెయిలౌట్‌ను కోరుతున్నందున దశలొో చైనీస్ పరిశోధనా నౌకను డాకింగ్ చేయడానికి కొలంబో  ఆమోదం చాలా కీలకంగా మారింది.