21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ, అమిత్‌ షా రాక

మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ తెలిపారు. మునుగోడు సభలో కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం చేయాలనే అంశాలపై పార్టీ శ్రేణులకు అమిత్‌ షా దిశా నిర్దేశం చేస్తారని ఆయన వెల్లడించారు.  మునుగోడు సభలోనే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. అలాగే ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇలా ఉండగా, బీజేపీ బుధవారం జరిపిన రాష్ట్ర పదాధికారుల  సమావేశంలో అమిత్ షా పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్ల గురించి చర్చించారు.  కానీ, విని ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేద్దామని అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు. 
 
  కమ్యూనిస్టు పార్టీలను ‘ఎర్ర గులాబీలు’గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని… ఆ పార్టీ నేతలే ఒకరికొకరు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయని చెబుతూ టీఆర్ఎస్ నియంత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ గెలుపుతో కేసీఆర్ అహంకారాన్ని అణగదొక్కాలని సూచించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారని, ఈ నేపథ్యంలో భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
  మునుగోడు ఉప ఎన్నిక 2023 లో తెలంగాణలో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్‌ వంటివి అని చెబుతూ దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడు బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలని పిలుపిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను తేలిగ్గా తీసుకోవద్దని, పార్టీ భవిష్యత్‌కు ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు.  మునుగోడు ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడులో పార్టీ విజయం కోసం 24I7 పనిచేయాలని సంజయ్ కోరారు.  
21న అమిత్‌షా సభ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి తేజావత్‌ రామచంద్రు నాయక్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, నర్సాపూర్‌ మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ మురళీయాదవ్, పలు వురు మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరనున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి.
ఇక బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర–3 ముగింపు సందర్భంగా ఈ నెల 27న హనుమకొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గానీ ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ సభలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీలో చేరుతారని అంటున్నాయి.