కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హద్దులు దాటిన అవినీతి

ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు తెలంగాణ సర్కార్  చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హద్దులు దాటి అవినీతి జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్  ఆరోపించారు. తెలంగాణ కలల ప్రాజెక్ట్ పేరుతో దేశం ముందుకు చర్చ తీసుకువచ్చి, అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
‘‘ప్రాజెక్ట్ కు అవసరమైన, సరైన అనుమతులు పొందకుండా, ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. ఇటీవల భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన మూడు పంప్​హౌజ్ లు మునిగిపోయాయి. కావాలంటే వెళ్లి చూడండి” అంటూ చెప్పుకొచ్చారు.
” అసలు ఈ పంపులు అమర్చిన సంస్థకు సరైన సాంకేతిక సామర్థ్యం లేదు..  పంపులు అమర్చడంలోనూ సరైన విధానం పాటించలేదు. దానితో విఫలమయింది.  ప్రాజెక్ట్ కట్టినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు మళ్లీ మోటార్ల రిపేర్ల పేరుతోనూ మరిన్ని కోట్ల అక్రమాలు జరిగే ఆస్కారం ఉంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీపై, ప్రధానిపై కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని చెబుతూ తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నదని షెకావత్​  చెప్పారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్​ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టీఆర్​ఎస్​ నేతలు చెప్తుంటే ఆ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, టీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని ముందు నుంచి బీజేపీ, కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు  కేంద్ర జల శక్తి శాఖ మంత్రే ఘాటుగా విమర్శించడం గమనార్హం.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శల కొట్టిపారేస్తూ పార్లమెంట్ సాక్షిగా ఇటీవల కేంద్రం స్పష్టత  ఇచ్చింది. ప్రాజెక్ట్ కు ఇన్వెస్ట్​మెంట్​ క్లియరెన్స్ లేదని, అందువల్ల జాతీయ హోదా  కల్పించలేమని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు.
నేషనల్ ప్రాజెక్ట్ (ఎన్ పీ) స్కీం కింద నిధుల కోసం ఒక ప్రాజెక్ట్‌‌‌‌ను చేర్చడానికి, ముందుగా సీడబ్ల్యూసీ ద్వారా అంచనా వేయాల్సి ఉంటుందని, అనంతరం సలహా కమిటీ ఆమోదించాలని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా అడుగుతున్న ప్రాజెక్ట్ ఎన్‌‌‌‌పీ స్కీమ్ కోసం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉంటే, హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ (హెచ్‌‌‌‌పీఎస్‌‌‌‌సీ) దీనిని పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. హెచ్‌‌‌‌పీఎస్‌‌‌‌సీ ద్వారా సిఫార్సు చేస్తే… నిధుల లభ్యత, మొదలైన వాటి ప్రకారం ఎన్ పీ స్కీం కింద ప్రాజెక్ట్‌‌‌‌ను చేర్చడాన్ని  కేంద్రం ఆమోదించవచ్చని తెలిపారు.
అవినీతిపై క్షేత్రస్థాయిలో అందిన సమాచారం తోనే  కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించినట్లు  తెలిసింది.  దాదాపు రూ. లక్ష కోట్లతో  కాళేశ్వరం ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినప్పటికీ  ఇప్పటివరకు కొత్తగా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందించలేదు. ఇటీవల వర్షాలకు పంపుహౌస్​లు నీటమునిగా యి. ఆ నీటిని తోడివేయగా.. మోటార్లు ధ్వంసమైన స్థితిలో బయటపడ్డాయి.
 ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు నోరు మెదపలేదు. అక్కడ ఏం జరుగుతు న్నదో తెలుసుకునేందుకు ప్రతిపక్షాలు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి పోలీసులతో అడ్డుకుంటున్నది.