450 రోజుల్లో కేసీఆర్‌ కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి

‘మిగిలింది మరో 450 రోజులు మాత్రమే.. ఆ తర్వాత కేసీఆర్‌ అహంకార పూరిత కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆలోచనలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బంగారు తెలంగాణ పేరిట ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి బైబై చెప్పే రోజులు దగ్గరపడ్డాయి’ అని బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ భరోసా వ్యక్తం చేశారు.

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే డబుల్‌ ఇంజన్‌తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, బంగారు తెలంగాణ సాకారమవు తుందని ఆయన తెలిపారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలో ‘గల్లీలో బీజేపీ– ఢిల్లీలో బీజేపీ ’ పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనతో ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ యువత కలలను కాలరాసిన సీఎం కేసీఆర్, తన కుటుంబంలో అందరికీ రాజకీయ ఉపాధి కల్పించారని ధ్వజమెత్తారు.

ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రజలు కేసీఆర్‌ పాలనతో విసిగిపోయారని చెబుతూ బీజేపీ అధికారంలోకి వస్తే యువతలో నైపుణ్యాన్ని వెలికితీయ డానికి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గల్ఫ్‌ వలస బాధితుల కష్టాలు తొలగించడానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమల్లోకి తెస్తామని తెలిపారు. ఈ ప్రాంతవాసుల సౌలభ్యం కోసం ముంబైకి రెగ్యులర్‌గా రైలు నడిచే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సురభి నవీన్‌కుమార్‌ బీజేపీలో చేరారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. రాష్ట్రంలో సీఎం.. కేసీఆరా, కేటీఆరా అని ప్రజలు పరేషాన్ అవుతున్నారని, కోరుట్లలోనూ అదే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు కొడుకు సంజయ్ పెత్తనం చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

టీఆర్ఎస్‌‌లా బీజేపీలో కుటుంబ పాలన ఉండదని స్పష్టం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు నిరాశ్రయులయ్యారని, వరదల్లో ప్రజలు చిక్కుకుంటే కనీసం రివ్యూ చేయకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌‌కి పరిమితమయ్యారని విమర్శించారు.

డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.5 వేల కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తామని వెల్లడించారు.

అంతకుముందు హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బంగారు శృతిలతో ఛుగ్‌ సమావేశమయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత బండి సంజయ్‌ పాదయాత్రలో స్పష్టమవుతోందని, దీనిని పార్టీకి అను కూలంగా మలుచుకునేందుకు రాష్ట్రం నలుమూలలా ఏక కాలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పార్లమెంటు ప్రవాస్‌ యోజన కార్యక్రమం కింద రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమితులైన కేంద్ర మంత్రులతో కలిసి ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేయాలని చెప్పారు. కాగా నల్లగొండ పార్లమెంటు పరిధిలో      కేంద్ర మంత్రి కైలాష్‌ చౌదరి, హైదరాబాద్‌లో జ్యోతిరాదిత్య సింధియా పర్యటనలు పూర్తయ్యాయని, ఈనెల 21నుంచి 23 వరకు ఆదిలాబాద్‌లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పర్యటన ఉంటుందని ప్రేమేందర్‌ రెడ్డి చెప్పారు.

‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీల గురించి సమావేశంలో చర్చించారు. ఈనెల 21న మునుగోడులో అమిత్‌షా బహిరంగసభను విజయవంతం చేయడంపై, 27న బండి సంజయ్‌ పాదయాత్ర ముగిసిన తర్వాత నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశాలపై కూడా మాట్లాడారు.