బిజెపిలోకి  చౌటుప్పల్ టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి

మునుగోడు అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కీలకమైన చౌటుప్పల్ టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి బీజేపీలో చేశారు. మంగళవారం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో వెంకట్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.   మాజీ జడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డిలు కూడా రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. 
 
 హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్ కు బుద్దిరాలేదని ఈ సందర్భంగా ఈటెల మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిపై పార్టీ నేతలకు వెగటు పుట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని చెబుతూ గులాబీ కండువాను వదిలేస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
 
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని చెబుతూ ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే అన్న ఈటల.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇన్నేళ్లు కష్టపడి పనిచేశామని, మరో 6 నెలలు ఇలాగే కష్టపడితే అధికారం మనదే అని భరోసా ఇచ్చారు.
కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వొద్దన్న అసమ్మతి నేతలను నాయకత్వం వహిస్తూ వెంకట్రెడ్డి గ్రూపు సమావేశం నిర్వహించారు. దానితో భూ వివాదాలతో వెంకట్రెడ్డిపై చౌటుప్పల్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం 
వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో సోమవారం అర్ధరాత్రి కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నికతో అధికార టీఆర్ఎస్ పార్టీలో మరోసారి గందరగోళం నెలకొంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పడంతో పోలీసులు అర్థరాత్రి అరెస్టులకు తెరలేపారు.
ఇదే క్రమంలో హైదరాబాద్, వనస్థలిపురం, తంగిరిళ్ళ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి ఇంటిని ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు చుట్టుముట్టారు. అరెస్టు చేసేందుకు యత్నించారు. చివరకు వెంకట్‌ రెడ్డి బీజేపీలో చేరడంతో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయి.
 టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారన్న సమాచారంతో పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.  తాను టీఆర్ఎస్ ను వీడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోలీసులచే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను తప్పనిసరిగా ఓడించి, బీజేపీ జెండా ఎగురవేస్తామనివెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. తాను టీఆర్ఎస్ బీఫామ్ పై ఎంపీపీగా గెలవలేదని గుర్తుచేశారు. 
 
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెంకట్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుని, ఆయన్ను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును వారు తీవ్రంగా ఖండించారు. మునుగోడు నియోజకవర్గంలోనే అతిపెద్దదైన చౌటుప్పల్ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. సొంత పార్టీ నాయకులను కాపాడుకునే పనిలో పడింది.