అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత నౌకాదళం ఆరు ఖండాలకు నౌకలను పంపి వేడుకలను నిర్వహించగా, వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తులు ఉత్సాహంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో భాగంగా అమెరికాలోని ప్రముఖ టెస్ట్ పైలట్, వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫోటోలు ట్వీట్ చేశారు. “భారత స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతోందో అంతరిక్షం నుంచి వీక్షిస్తున్నా… భారత అమెరికన్లు నిత్యం పురోగమిస్తోన్న వాటిల్లో నాసా కూడా ఒకటి” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోలను షేర్ చేశారు.
మరోవైపు స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ఓ బెలూన్ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ పతాకాన్ని ఆవిష్కరించింది.  ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.
6 ఖండాల్లో తిరంగా జెండా ఆవిష్కరణ
భారత  స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు భారత్‌కే పరిమితం కాదని, ఖండాంతరాలలో కూడా వేడుకలు నిర్వహించగలమని భారత నావికాదళం చాటిచెప్పింది. 6 ఖండాలు, 3 మహాసముద్రాలు, 6 టైమ్ జోన్లలో తిరంగా జెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీటర్ వేదికగా పంచుకుంది. 
 
అంటార్కిటికా మినహా 6 ఖండాలకు  నౌకలను నేవీ మోహరించినట్టు వెల్లడించింది. ప్రవాస భారతీయులు, ఆతిథ్య దేశం నాయకుల బృందం, ప్రతినిధుల సమక్షంలో జెండాను ఆవిష్కరించినట్టు నేవీ అధికారులు తెలిపారు.  దీంతో 6 ఖండాలు, 3 మహాసముద్రాలు, 6 వేర్వేరు టైమ్ జోన్లలో భారత జాతీయ పతకాన్ని ఎగురవేసినట్టయ్యింది. తిరంగా జెండా స్ఫూర్తిని చాటిచెప్పామని నావికాదళం ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేసింది.
ఐదు కోట్ల మందికి పైగా సెల్ఫీల రికార్డు
కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్‌ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్‌ ఘర్‌ తిరంగా వెబ్‌సైట్‌కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది.
 
ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది.  ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్‌సైట్‌ నిండిపోతోంది.
సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్‌ దాటాం’ అని పౌరులను అభినందించింది.  మంగళవారం ఉదయం కూడా వెబ్‌సైట్‌లోకి ఫోటోలు అప్‌లోడ్‌ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్‌ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది.
 ‘జయహో 2.0’ ఆలపించిన 75 మంది కళాకారులు 
 
 మరోవంక, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 75 మంది కళాకారులు కలిసి ‘జయహో’ అనే దేశ భక్తి గీతాన్ని ఆలపించారు. ‘జయహో 2.0’ పేరుతో రూపొందించిన ఈ పాటకు సౌరేంద్రో-సౌమ్యజిత్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. 
 
1911లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘భారత భాగ్య విధాత’ ఐదు శ్లోకాలను… ఈ కళాకారులు ఆలపించారు. ‘జయహో 2.0 అనేది భారత భాగ్య విధాత / జనగనమణ పూర్తి 5 శోక్లాల అభినయం. ఇది మన ప్రియమైన మాతృభూమి పట్ల గౌరవం, ప్రేమ, అభిమానాన్ని నింపే కళల రాగం’ అని అంబుజ నియోటియా యూట్యూబ్‌ చానల్‌ పేర్కొంది. 
 
ఈ సాంగ్‌లో ఆశాభోంస్లే, కుమార్‌ సాను, హరిహరన్‌, అమ్జద్‌ అలీకాన్‌, హరిప్రసాద్‌ చౌరాసియా, కె.ఎస్‌. చిత్ర, ఉదిత్‌ నారాయణ్‌, శివమణి, బంబే జయశ్రీ, కైలాష్‌ ఖేర్‌, సాధనా సర్గమ్‌, రషీద్‌ ఖాన్‌, అజోరు చక్రవర్తి, శుభా ముద్గల్‌, అరుణ్‌ సాయిరామ్‌, ఎల్‌ సుబ్రమణ్యం, విశ్మ మోహన్‌ భట్‌, శాంతను మొయిత్రా, వి. సెల్వ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.