నేతాజీ అస్థికల డీఎన్ఎ టెస్ట్ కు కుమార్తె సుముఖం 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయారని చెప్పి 77 ఏళ్ళవుతున్నా ఇంకా ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయన మరణాన్ని నిర్ధారించడం కోసం ఏకైక ఆధారంగా మిగిలిన జపాన్ లోని టోక్యో రెంకోజీ టెంపుల్‌లో ఉన్న నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించాలని చాలాకాలంగా డిమాండ్లు వస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
తాజాగా, అందుకు ఆయన కుమార్తె అనితా బోస్ సంసిద్ధత వ్యక్తం చేశారు. పైగా, నేతాజీ 125వ జన్మదినోత్సవం, భారత్ స్వతంత్ర స్వర్ణోత్సవం సందర్భంగా అయినా అక్కడున్న అస్థికలను భారత్ కు తీసుకు వచ్చి, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో భద్రపరచాలని ఆమె చాలాకాలంగా కోరుతున్నారు.
 రెంకోజీ టెంపుల్‌లో ఉన్న అస్థికలు నేతాజీవేనా కాదా అనే విషయంలో డీఎన్‌ఏ టెస్ట్ చేయాలనుకుంటే తాను అందుకు సిద్ధమని అనిత ప్రకటించారు. నేతాజీ అస్థికలు ఉండాల్సింది భారత్‌లోనే అని ఆమె చెబుతున్నారు. నేతాజీ జీవితాన్నంతటినీ భారత స్వాతంత్ర్యం కోసమే అర్పించారని ఆమె గుర్తు చేశారు.
భారతీయులు ఇప్పటికైనా ఆయన అస్థికలను భారత్‌కు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నించాలని కూడా ఆమె పిలుపునిచ్చారు.  నేతాజీ తైవాన్ నుంచి బయలుదేరిన విమాన ప్రమాదంలో మరణించారని ఎక్కువ మంది భావిస్తున్నారు. విమాన ప్రమాదానంతరం నేతాజీ అస్థికలను రెంకోజీ మందిరంలో భద్రపరిచారు. ఇప్పటివరకు మూడు తరాల పూజారులు వీటిని సంరక్షిస్తూ వచ్చారు.  ప్రస్తుతం జర్మనీలో ఉంటోన్న అనితా బోస్ ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్. ఆమె వయసు 79 సంవత్సరాలు.
1937లో నేతాజీ తన కార్యదర్శి ఎమిలీని ఆస్ట్రియాలో రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అనిత 1942లో ఆస్ట్రియాలో జన్మించారు. నేతాజీ బ్రిటీష్‌ వారిపై పోరాటంలో భాగంగా జర్మనీ నుంచి ఆసియాకు వెళ్లిపోయినప్పుడు అనిత వయసు నాలుగు నెలలు మాత్రమే.
మరోవైపు డీఎన్‌ఏ టెస్ట్‌కు తమకు అభ్యంతరం లేదని జపాన్ ప్రభుత్వంతో పాటు రెంకోజీ మందిరం పూజారులు కూడా చెప్పారని అనితా బోస్ గుర్తు చేస్తున్నారు. నేతాజీ అస్థికలను భారత్‌కు అప్పగించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని కూడా ఆమె చెబుతున్నారు.  అనితాతో పాటు నేతాజీ బంధువులంతా కూడా తైవాన్ నుంచి నేతాజీ ఎక్కడకు ఎలా వెళ్లారో, ఏమైపోయారో కనుక్కోవాలని భారత ప్రభుత్వాన్ని చాలాసార్లు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని నేతాజీ బంధువులంతా ఆశిస్తున్నారు.  నిజానికి నేతాజీ బంధువులందరినీ ప్రధాని మోదీ గతంలో కలుసుకున్నారు. నేతాజీ విషయంలో అన్ని విధాలా సహకరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు.
స్వాతంత్ర్య సాధనకు అహింసా మార్గం సరిపోదని, పోరుబాట తప్పదని భావించిన నేతాజీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌  అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమనప్పుడు బ్రిటీష్ వారిని భారత్ నుంచి తరిమేసేందుకు అదొక గొప్ప అవకాశమని భావించి రష్యా, జర్మనీ, జపాన్‌లో పర్యటించారు.
జపాన్ సాయంతో భారత యుద్ధ ఖైదీలు, కూలీలు, ఇతర దేశభక్తులతో సింగపూర్‌లో అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశారు. ఇందుకు జపాన్ సైనిక, ఆర్ధిక, దౌత్యపరంగా సాయమందించింది. అజాద్ హింద్ ఫౌజ్‌ను బలోపేతం చేసే క్రమంలో ఆయన అనేక చోట్ల పర్యటించేవారు. ఇదే క్రమంలో 1945 ఆగస్ట్ 18న తైవాన్‌ నుంచి టోక్యో వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారని ప్రచారం జరిగింది.
అయితే ఆయన ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లారని పలువురు నమ్మారు. ఈ  విషయమై రకరకాల కధనాలు ప్రచారంలోకి వచ్చినా అవేమి నిర్ధారణ కాలేదు. నేతాజీ మరణించారా లేదా అసలు తైవాన్‌లో విమాన ప్రమాదం జరిగిందా లేదా అనే విషయంపై గతంలో కూడా భారత ప్రభుత్వం కమిషన్లను ఏర్పాటు చేసింది. 1956లో షానవాజ్ కమిటీ చేసిన యత్నాలు నాడు తైవాన్‌తో సత్సంబంధాలు లేక విజయవంతం కాలేదు.
ఆ తర్వాత 1999లో ఏర్పాటైన ముఖర్జీ కమిషన్ నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, అయితే రెంకోజీ మందిరంలో ఉన్న చితాభస్మం నేతాజీది కాదంటూ 2005లో నివేదిక సమర్పించింది. దీన్ని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది కూడా. రెంకోజీ మందిరంలో ఉన్నది నేతాజీ అస్థికలేనా కాదా అనే విషయం తేలడం కోసం డిఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధమని అనితా బోస్ ముందుకొచ్చారు. అస్థికలు నేతాజీవేనా కాదా అనే విషయం త్వరలోనే తేలే అవకాశం ఉంది.