‘లాల్‌ సింగ్‌ చడ్డా’ పప్పులు ఉడకలేదు

 
‘‘టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్‌ చేసినా ‘లాల్‌ సింగ్‌  చడ్డా’పప్పులు ఉడకలేదు” అంటూ  తాజాగా విడుదలైన మిస్టర్ ఫరఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్‌ సింగ్‌  చడ్డా’,  ఆ చిత్రంకు మద్దతుగా నిలిచినా టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, నాగార్జునలను ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు.
దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత,  హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమిర్‌ఖాన్‌ చిత్రం కుదేలైందని ఆమె ధ్వజమెత్తారు.  జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశభక్తులకు ఆమె ధన్యవాదములు తెలిపారు.
 అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’  చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించారు. అలాగే నాగచైతన్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో నాగార్జున కూడా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగమయ్యారు. 
 
రామ్‌చరణ్‌, రాజమౌళి, సుకుమార్‌ కూడా ఈ చిత్రం ప్రీమియర్‌ చూసి ప్రశంసించారు. అందుకే విజయశాంతి టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు అంటూ వారందరిని లక్ష్యంగా చేసుకొంటూ  ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ వైరల్ గా మారింది.  దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు ఆమిర్‌ నైజం తెలుసుకుని ఆయన సినిమాలను అసహ్యించుకుంటున్న నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతోందో గ్రహించి,  కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు, విదేశీ మార్కెట్‌ మీద ఆధారపడ్డాడని ఆమె తెలిపారు.
టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్‌ చేసినా లాల్‌ సింగ్‌ పప్పులు ఉడకలేదు. దీనంతటికీ కారణం ఒకటే…. మేకవన్నె పులిలా వ్యవహరించే ఆమిర్‌ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ మరియు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ,  వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారని విజయశాంతి గుర్తు చేశారు.
ఫలితంగా ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారని, పాకిస్థాన్‌కి వంత పడుతూ ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమిర్‌ ఖాన్‌ సినిమా టికెట్‌ డబ్బుల్ని,  పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న తమవంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారని ఆమె మెచ్చుకున్నారు.
అంతేకాదు, తన సినిమాలు చూేస్త చూడండి లేకుంటే లేదన్న లాల్‌ సింగ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్థం చేసుకున్నారని అంటూ ఆమె చురకలు అంటించారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలని విజయశాంతి హెచ్చరించారు.
అమీర్ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడంటే దేశవ్యాప్తంగా ఆసక్తి మొదలవుతుంది. ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. ఒక్కో సినిమాపై ఏళ్ళ తరబడి పరిశోధన చేసి, ఓ యజ్ఞంలో సినిమాని చేస్తుంటాడు. `లాల్ సింగ్ చద్దా’ విషయంలోనూ అదే జరిగింది. 
 
`ఫారెస్ట్ గంప్’ అనే ఓ అమెరికన్ చిత్రాన్ని అమితంగా ప్రేమించిన అమీర్ దాన్ని రీమేక్ చేయడానికి ఏళ్ళ తరబడి విశ్వప్రయత్నం చేసాడు. చివరికి ఎంతో వ్యయ, ప్రయాసల మధ్య రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా పడింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ 13  కోట్లు మాత్రమే సాధించింది. 
అమీర్‌ ఖాన్‌ చిత్రాల్లో ఇదే అల్పం. కథ, కథనాల్లో వైవిధ్యం లేకపోవడం, స్లో నేరేషన్‌ ‘లాల్‌ సింగ్‌..’కు ప్రతికూలంగా మారాయి. దాంతో పాటు,  ‘బాయ్‌ కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా’ అనేది సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమంగా నడుస్తోంది.  గతంలో హిందూ మతానికి, ఆచారాలకూ వ్యతిరేకంగా అమీర్‌ చేసిన వ్యాఖ్యల ప్రతిరూపమే ఇది. అది కూడా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ చిత్ర కథానాయిక కరీనా కపూర్‌ స్పందించింది.
‘‘రెండేళ్ల కష్టం ఈ సినిమా. దయ చేసి ఎవరూ ఈ చిత్రాన్ని బాయ్‌ కాట్‌ చేయొద్దు. మొత్తం ప్రేక్షకుల్లో ఒక శాతం మాత్రమే  మా సినిమాని టార్గెట్‌ చేశారు. వాళ్లే నెగిటీవ్‌ ప్రచారం చేస్తున్నారు. దయచేసి మంచి సినిమాని ప్రేక్షకుల నుంచి దూరం చేయొద్దు’’ అని కరీనా విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సినిమా డిజాస్టర్‌ లిస్టులోకి విశ్లేషకులు చేర్చేశారు. దాంతో బాలీవుడ్‌కి మరో గట్టి దెబ్బ తగిలినట్టైంది.