కశ్మీర్‌ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి

కాశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్‌ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్‌ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా,  అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.  తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి గుర్తించారు.

‘షోపియాన్‌, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్‌ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విట్టర్‌ ద్వారా కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

కశ్మీర్ లోయలో గత 24 గంటల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిపై దాడి జరగడం ఇది రెండోసారి. సోమవారం అర్ధరాత్రి సెంట్రల్‌ కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి చేయగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

కశ్మీర్ పండిట్ కాల్చివేత ఘటన పట్ల గవర్నర్ మనోజ్ సిన్హా ఓ ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. సోపియాన్ జిల్లాలో పౌరులపై ఉగ్రవాదుల దాడి గుండెల్ని పిండేస్తోందని, మృతుని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇలాంటి పాశవిక చర్యలకు బాధ్యులైన ఉగ్రవాదులను విడిచి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మూడు రోజుల క్రితం బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుని బండిపొర జిల్లాలో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని మధేపురకు చెందిన మహమ్మద్ అమ్రెజ్‌ అనే చేనేత కార్మికునిగా గుర్తించారు. ఈ ఏడాది ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నాలుగో స్థానికేతరుడు అమ్రెజ్ కావడం విశేషం. ఈ ఏడాది జరిగిన లక్షిత దాడుల్లో మొత్తం 14 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.