డెంగీ, మలేరియా బారిన తెలంగాణ ప్రజలు

డెంగీ, మలేరియా బారిన తెలంగాణ ప్రజలు

వర్షాలు దండిగా కురుస్తుండడం, తెరిపి ఇచ్చినపుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు హెచ్చుగానే ఉండడంతో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు ఈగలు, దోమల సంతతి గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఫలితంగా దోమకాటు కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.దానికి తోడు ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా జతవుతు ఉండడంతో  ఎలంగాణలో ప్రజలను జ్వరాలకు తోడు దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, డయేరియా తదితర అనారోగ్య సమస్యలు  సతమతం చేస్తున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర రోగులతో నిండిపోతున్నాయి. నెలన్నర రోజులుగా రాష్ట్రంలో జ్వరాలు, డయేరియా, దగ్గు, జలుబుతో జనం మంచం పడుతున్నారు. జ్వర తీవ్రత అధికంగా ఉంటుండడంతో చాలా మంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో, సరైన రీతిలో వైద్యం అందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.

పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లోనే రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 300 నుంచి 400 మంది మాత్రమే వస్తుంటారు. సీజన్‌మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఇక ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది.

వీరిలో ఎక్కువగా హెపటైటిస్, డెంగ్యూ, విషజర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఒపి ఉంటోంది.

పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ జ్వరాలను వైరల్‌ ఫీవర్స్‌ గా అధికారులు చెబుతున్నా మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలు రోగుల్లో బహిర్గతం అవుతున్నాయని ల్యాబ్‌ల నిర్వహకులు చెబుతున్నారు.

దోమకాటు కారణంగా డెంగీ జ్వరాల బారిన పడుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్క ములుగు జిల్లాల్లోనే దాదాపు 69 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు డెంగీ, మలేరియాతో మంచం పడుతున్నారు. వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ,ముక్కుకారడం,ఎక్కువగా దాహం వేయడం, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్న వాళ్లకు 3 నుంచి 4 రోజులపాటు మందులు వాడినా తగ్గకపోతే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించడంతోపాటు నీరు నిలిచిన చోట్ల దోమలు వృద్దిచెందుతున్నాయి. మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు పారిశుధ్య చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల ఫాగింగ్‌ మిషన్లు మూలకు పడ్డాయి.

అయితే దోమల నివారణకు ఫాగింగ్‌, దోమల మందులను పిచికారి చేయడం, బ్లిచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి పారిశుధ్య చర్యలు లోపించాయి. ఫలితంగా మురికి కాలువలు, నీరు నిలిచిన గుంతల్లో ఈగలు, దోమల తీవ్రంగా ప్రబలుతున్నాయి. డ్రైనేజీ కాలువలు చెత్తా చెదారంతో నెలల తరబడి నిండిపోయినప్పటికీ శుభ్రం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కరోనా రోగులు సహితం నిత్యం పెరుగుతూనే ఉన్నారు. చాలామంది ఇంటివద్దనే వైద్యం చేయించు కొంటూ ఉండడంతో ప్రభుత్వ పరిగణలోకి రావడం లేదు. కరోనా పరీక్షల వివరాలపై ప్రభుత్వ అజమాయిషీ ఏమాత్రం ఉండటం లేదు.