కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివి 

ప్రపంచ స్థాయిలో పలు దశల కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివని నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు. 
 
దేశ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి జాతిని ఉద్ధేశించి ఆదివారం సాయంత్రం ప్రసంగిస్తూ ప్రపంచమంతా కరోనా  కల్లోలంతో సతమతమయిన దశలో భారతదేశం ఈ వైరస్ సంక్షోభాన్ని ధృఢ సంకల్పంతో ఎదుర్కొని, ఇందులో విజయం సాధించిందని గుర్తు చేశారు. 
 
ప్రజాస్వామ్యపు నిజమైన సమర్థత, ప్రాధాన్యతల గురించి కనుగొనేందుకు భారతదేశం ప్రపంచానికి తన తోడ్పాటు అందించిందని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియ ప్రాధాన్యతతో పటిష్టతతో ఇతర దేశాల అన్వేషణకు స్ఫూర్తిగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. దేశ జనులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, తొలిసారిగా దేశ జనులను ఉద్ధేశించి ఆమె ప్రసారసాధనాల ద్వారా ప్రసంగించారు.
 
 అణగారిన వర్గాలు, బడుగు, వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించగలిగామని చెబుతూ ఈ కోణంలో భారత దేశ ఖ్యాతి మరింతి ఇనుమడించిందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక సంస్కరణలు కీలక దశలో ఉన్నా యని పేర్కొంటూ ప్రధాన ఆర్థిక సంస్కరణల చర్యలు సృజనాత్మక సంక్షేమ పథకాలు, చొరవలతో సాగుతున్నాయని ఆమె వివరించారు. 
 
కరోనా తరువాతి దశలో భారత్ ఇటీవలి దశలో సరికొత్త శక్తిగా మారుతోందని ఆమె భరోసా వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ సంబంధిత వ్యవస్థలు కలకాలం నిలుస్తాయా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారని, రాజ్యాంగాల నిపుణులకు కూడా సందేహాలు కలిగాయని ఆమె గుర్తు చేశారు. అయితే వీటిని భారతీయులు తుత్తునియలు చేశారని రాష్ట్రపతి ప్రశంసించారు.
అనుమానాలు తప్పులని తేల్చివేశారని ఆమె తెలిపారు. ప్రాంతీయ అసమానతలు తగ్గి, ప్రగతి సార్వత్రిక అయిందని అంటూ రాష్ట్రపతి 17 నిమిషాల పాటు తమ ప్రసంగం సాగించారు. ప్రత్యేకించి ఇటీవలి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం కనబర్చిన సమర్థత, సాధించిన విజయం సర్వత్రా ప్రశంసలకు దారితీసిందని ఆమె తెలిపారు.
మానవ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మనం వ్యాక్సినేషన్ల ప్రక్రియను చేపట్టామని, కేవలం దేశీయ ఉత్పత్తి టీకాలతోనే సంపూర్ణ వ్యాక్సినేషన్ దశకు చేరుకుంటున్నామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో మొత్తం మీద దేశం 200 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని దాటిందని ముర్ము గుర్తుచేశారు.
ఓ మహత్తరమైన భారతదేశ నిర్మాణం సార్థకం అయితేనే మన ప్రయాణాలకు పూర్తిస్థాయి సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ఈ దశలో కన్నడ కవి కువెంపు కవితలోని మాటలను ఆమె ఉటంకించారు.
‘నేను వెళ్లిపోతాను…మీరూ తప్పదు ..అయితే మట్టి లో కలిసిపోయే మన ఎముకలతో సరికొత్త భారత ఘట్టపు మహా అధ్యాయం మొలుస్తుంది’ అని అప్పట్లో ఆ కవి ఇచ్చిన పిలుపు ఆ తరువాత దేశ విముక్తి కోసం త్యాగాలు చేసేందుకు స్ఫూర్తిగా నిలిచిందని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయని, పలు రంగాలలో మహిళలు ముందుకు దూసుకువెళ్లుతున్నారని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.