మునుగోడులో బిజెపి గెలిచి తీరాలి

కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో బీజేపీ గెలిచి తీరాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ స్పష్టం చేశారు. ఇక్కడ విజయం సాధిస్తే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.

సీఎం కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారని, బీజేపీ కార్యకర్తలందరూ హనుమంతుడి వారసులుగా మారి కేసీఆర్‌ లంకను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం వద్దకు చేరుకుంది. భోజన విరామ సమయంలో పార్టీ నేతలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వారీగా కమిటీలు వేసి, యువత, మహిళలు, రైతులకు స్థానం కల్పించాలని సూచించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించామని గుర్తు చేశారు.

అదే పద్ధతిలో మునుగోడులోనూ నాయకులందరూ ఎక్కువ సమయం కేటాయించి పని చేస్తే, సులభంగా గెలవచ్చని సూచించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లను వేరుగా చూడొద్దని, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచామని, అప్పటికన్నా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగినందున మునుగోడులోనూ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పోలింగ్ బూత్‌‌‌‌ల బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించబోతుందని చెప్పారు. కార్యకర్తలందరూ మోదీలుగా మారి, మునుగోడులో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ బీజేపీ గెలిేస్త రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  త్వరలోనే తానూ మునుగోడుకు వస్తానని, అక్కడే మకాం వేస్తానని ప్రకటించారు.

ఇలా ఉండగా, పార్టీ సీనియర్ నాయకులతో తరుణ్ ఛుగ్ మునుగోడు ఉపఎన్నిక వ్యూహం గురించి చర్చించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీలు జి వివేక్ వెంకటస్వామి, జితేంద్రారెడ్డి లకు మొత్తం బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.