ఉగ్రవాదుల కాల్పుల్లో బిహార్ కూలీ మృతి

జమ్మూ-కశ్మీరు లోని బందిపొరలో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా ఓ కూలీని హత్య చేశారు. గురు-శుక్రవారాల మధ్య రాత్రి అజస్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు.
కశ్మీరు జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్‌లోని మాధేపుర, బేసర్హ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అమ్రేజ్ జమ్మూ-కశ్మీరులోని బందిపొర జిల్లా, సోడ్‌నారాలో కూలీ పనుల కోసం వచ్చారు. ఆయనపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ప్రాణాలు కోల్పోయారు.
మృతుని సోదరుడు మాట్లాడుతూ, తన సోదరుని మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకెళ్ళేందుకు సహాయం చేయాలని  జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను, అధికారులను కోరారు.  తన వద్ద డబ్బులు లేవని చెప్పారు.
ఇదిలావుండగా, రాజౌరి  జిల్లాలో సైనిక శిబిరంపై గురువారం ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నలుగురు సైనికులు అమరులయ్యారు, ఇద్దరు సైనికులు గాయపడ్డారు. సైనిక శిబిరంపై దాడి జరగడం 2018 తర్వాత ఇదే తొలిసారి.  గత వారం పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో బిహార్ కూలీ మహమ్మద్ ముంతాజ్ ప్రాణాలు కోల్పోగా, మహమ్మద్ అరిఫ్, మహమ్మద్ మక్బూల్ గాయపడ్డారు.