ఢిల్లీలో 2000 బుల్లెట్లు స్వాధీనం, ఆరుగురు అరెస్ట్

స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునేందుకు యావత్తు దేశం సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీలో పెను ముప్పు తప్పింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2,000కు పైగా లైవ్ కార్‌ట్రిడ్జెస్, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు ? ఎందుకు తరలిస్తున్నారు ? అనేది తెలియాల్సి ఉంది. ఆ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 
 
డెహ్రాడూన్ లోని లైసెన్స్ గల ఓ తుపాకీలు షాప్ నుండి ఇవి సరఫరా అయిన్నట్లు తెలుస్తున్నది. లక్నో, జయునపుర్ ల మీదుగా ఢిల్లీ చేరినట్లు చెబుతున్నారు. ఆ తుపాకీలు షాప్ యజమాని వీటి అమ్మకలకు సంబంధించి ఇతర తుపాకీ షాప్ లకు అమ్ముతున్నట్లు  నకిలీ వోచర్లు వ్రాస్తూ, నేరస్థులకు విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు. 
 
తుపాకీ షాప్ యజమాని పరీక్షిత్ నేగి కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మొదటిసారిగా, స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని జాతీయ పతాకం ఆవిష్కరించి, ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో గాలిపటాలు ఎగరకుండా చర్యలు తీసుకొంటున్నారు. 
 
 స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకొంటున్నారు.  ఈ నేపథ్యంలో దేశ రాజధాని నగరమంతా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే  తనిఖీలు నిర్వహిస్తుండగా బుల్లెట్లను తరలిస్తున్న వ్యక్తులు దొరికిపోయారు. 
ఇటీవల ఐసిస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు మొహిసిన్ అహ్మద్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అహ్మద్‌ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో చురుగ్గా నిర్వహిస్తున్నాడని అహ్మద్‌పై ఆరోపణలను నమోదు చేశారు.