గగన్‌యాన్‌ ప్రయోగానికి సన్నాహాలు మొదలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌ ప్రయోగానికి సన్నాహాలు మొదలు పెట్టింది. గగన్‌యాన్‌ రాకెట్‌ను అంతరిక్ష వినువీధుల్లోకి పంపేందుకు సిద్దమవుతోంది. గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌కు చెందిన కీలక పరీక్షలు విజయవంతమైనట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
మిషన్‌లో ప్రధానమైన ఆల్టిక్యూడ్‌ ఎస్కేప్‌ మోటారు స్థిర పరీక్ష షార్‌లో బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన బుల్లి రాకెట్‌ వైఫల్యాలను పున:సమీక్ష చేస్తునే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్‌యాన్‌పై వడివడిగా అడుగులు వేస్తోంది. శ్రీహరికోట సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో గగన్‌యాన్‌కు సంబంధించిన పరీక్షలను వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక పరీక్ష విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఏడాది చివరిలోపు మానవ రహిత ప్రయోగాన్ని చేపట్టడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోని కీలకమైన క్రూఎస్కేప్‌ సిస్టమ్‌కు చెందిన ఆల్టిక్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌(ఎల్‌ఈఎం)ని విజయవంతంగా పరీక్షించారు.
ఈ పరీక్ష అంత్యత ప్రధానమైనదిగా ఇస్రో వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాహనక నౌకలో ఏదైనా అనుకోని ఘటన జరిగిన సమయంలో క్రూఎస్కేప్‌ సిస్టమ్‌ వ్యోమగాములను రక్షించనుందని తెలియజేశారు. వాహననౌక ప్రారంభ దశలో మిషన్‌ ఆగిపోయిన దశలో ఆల్టిక్యూడ్‌ ఎస్కేప్‌ మోటారు సీఈఎస్‌కు అవసరమైన త్రెస్ట్‌ను అందిస్తుంది.
మోటారు పాలస్టిక్‌ పరిమితులు అంచనా వేయడం, సబ్‌ సిస్టమ్‌ పనితీరును ధృవీకరించడం, డిజైన్‌ మార్జిన్‌లను నిర్ధారించడం, నాజిల్‌ లైనర్‌ల ఉష్ణ పనితీరును అంచనా వేయడంతో పాటు ఇతర సమగ్ర వివరాలను అంచనా వేయడానికి పలు పరీక్షలు చేశారు. ఇక గగన్‌యాన్‌ ప్రధాన ప్రాజెక్టుపై ఇస్రో దృష్టి సారించింది.