చైనాకు దీటుగా తైవాన్ సైనిక విన్యాసాలు

తైవాన్ చుట్టూ గత కొన్ని రోజులుగా చైనా సాగిస్తున్న యుద్ధ సన్నాహాలు, సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్ మంగళవారం సైనిక విన్యాసాలు మొదలు పెట్టింది. 
 
ఒకవేళ చైనా దాడి తలపెడితే తనను తాను రక్షించుకునేందుకు సైనిక సన్నద్ధతను పరీక్షిస్తోంది. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు మొదలైనట్టు తైవాన్ ఎయిత్ ఆర్మీ కార్ప్స్ అధికార ప్రతినిధి లూవీ జే ధ్రువీకరించారు. లక్ష్యాలను తాకేలా కాల్పుల, ఫిరంగుల ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, తైవాన్ జలసంధి ద్వారా తూర్పు, దక్షిణ చైనా సముద్రాలను నియంత్రణ లోకి తీసుకురావాలన్నదే చైనా సంకల్పమని, ఆసియా పసిఫిక్ ప్రాంతం యథాతధ స్థితిని మరింత విస్తరింపచేసి తైవాన్‌కు ఇతర దేశాల సహాయం అందకుండా నివారించాలన్నదే చైనా లక్షమని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోసఫ్ వూ పేర్కొన్నారు. 

అకస్మాత్తుగా చైనా దాడి చేస్తే ప్రతిఘటించేందుకు తైవాన్ మిలిటరీ ‘లైవ్‌ఫైర్ డ్రిల్స్’ నిర్వహించిన తరువాత జోసెఫ్ వూ తైపీలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గత వారం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం తమ డ్రిల్స్‌ను ముమ్మరం చేశాయని చైనా సాకుగా చెబుతోందని పేర్కొన్నారు.

నాన్సీ పెలోసీ పర్యటన తరువాత తైవాన్ నుంచి కొన్ని ఆహార పదార్ధాల దిగుమతులను నిషేధించిందని గుర్తు చేశారు. తైవాన్‌పై దాడి కోసమే ఈ డ్రిల్స్ రిహార్సల్స్ అని, తైవాన్‌ను మించి భౌగోళిక వ్యూహాత్మక ఆశయం సాధించడానికే చైనా ఎక్స్‌ర్‌సైజ్ ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. 

తైవాన్ ప్రజలను నైతికంగా బలహానం చేయడమే చైనా లక్షమని ధ్వజమెత్తారు. గురువారం నుంచి చైనా మిలిటరీ నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ జలసంధి లోకి చైనా పంపుతోంది. తైవాన్ చుట్టూ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఉద్రిక్తతలను సడలించడానికి బదులు చైనా తన కసరత్తు పొడిగిస్తోంది. అవి ఎప్పుడు ముగుస్తాయో ప్రకటించకుండా ముట్టడిస్తోంది.