హైకోర్టు జడ్జీల పెంపు అడ్డుకున్న జగన్.. రాజధాని మార్పుపై ఝలక్!!

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులలో హైకోర్టును కర్నూల్ కు మార్చడం కీలకం కానున్నది. పరిపాలన రాజధానిని రాష్ట్ర ప్రభుత్వమే విశాఖపట్నంకు మార్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ హైకోర్టు మార్చాలంటే ముందుగా సుప్రీంకోర్టు, కేంద్రం ఒప్పుకొంటేనే రాష్ట్రపతి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. 
 
అయితే, హైకోర్టు మార్పు విషయం కేంద్రం వద్ద పెండింగ్ లో లేదని, ఆ విషయం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుతో మాట్లాడుకొని నిర్ణయించుకోవలసిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్  రిజిజు   పార్లమెంట్ లో చెప్పడంతో హైకోర్టు తరలింపుకు కేంద్రం సుముఖంగా లేన్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ విషయమై హైకోర్టును సంప్రదించడానికి జగన్ ప్రభుత్వం సహితం సంసిద్ధత వ్యక్తం చేయక పోవడం గమనార్హం. 
 
హైకోర్టు న్యాయమూర్తులతో గతంలో జగన్ ప్రభుత్వం ఘర్షణకు దిగిన విధంగా మరోమారు ప్రచ్ఛన్న పోరు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  తాజాగా హైకోర్టు చేసిన ఓ కీలక ప్రతిపాదనకు జగన్ తోసిపుచ్చడంతో హైకోర్టు తరలింపు విషయంలో హైకోర్టు విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు సానుకూలత వ్యక్తం చేస్తే గాని సుప్రీంకోర్టు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ముందడుగు వేసే అవకాశం లేదు.
అందుకనే హైకోర్టు తరలింపు పట్ల మొదట్లో సానుకూలత వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గతంలో తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులతో సీఎంగా ఉన్న జగన్ విభేదించారు. అంతే కాదు అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రంగా జడ్డీలు తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు.
అయితే అప్పట్లో సీజేఐగా ఉన్న బాబ్డే దీనిపై విచారణ జరిపి ఆరోపణల్ని తోసిపుచ్చారు. దీంతో ఆ పోరు అక్కడితో ముగిసిందని అంతా భావించారు. ఆ తర్వాత జస్టిస్ ఎన్వీరమణ సీజేఐ కావడంతో జగన్ కూడా శాంతించారు
ఈ లోగా, ఏపీలో హైకోర్టు జడ్జీల్ని ప్రస్తుతం ఉన్న 37కు మించి పెంచాలంటూ హైకోర్టు తాజాగా కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడి నేపథ్యంలో జడ్డీల ఖాళీల భర్తీతో పాటు జడ్డీల సంఖ్య పెంపు కూడా తప్పనిసరని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించి జడ్డీల ఖాళీలను భర్తీ చేస్తూ వచ్చింది. 
 
అదే సమయంలో హైకోర్టు జడ్డీల సంఖ్య కూడా పెరిగితే సమస్య తీరిపోతుంది హైకోర్టు భావించింది. కానీ చివరి నిమిషంలో ఈ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా పోవడంతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దీంతో ఏపీ హైకోర్టులో జడ్డీల సంఖ్య 37కే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. వివిధ కారణాలతో ఆయన కేంద్రాన్ని ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని కోరారు.
ఈ విషయాన్ని న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు తాజాగా పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న హైకోర్టు జడ్డీల పెంపు ప్రతిపాదన చేసిందని, అయితే ఏప్రిల్ 29న సీఎం జగన్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమకు లేఖ రాశారని కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో కేంద్రం కూడా ముందుకు వెళ్లలేకపోయిందని చెప్పారు. అయితే హైకోర్టులో ఖాళీగా ఉన్న ఆరు జడ్డీల పోస్టుల భర్తీకి కొలీజియం నుంచి వచ్చిన ప్రతిపాదన తమకు అందినట్లు ఆయన తెలిపారు.
జడ్డీల పెంపుకు హైకోర్టు నుంచి వచ్చిన ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన వెనక్కి పోయింది. అదే సమయంలో హైకోర్టు తరలింపు కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంటులో వేస్తున్న ప్రశ్నలకు తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పెండింగ్ లో లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అంతే కాదు హైకోర్టు సీజేతో ప్రభుత్వం చర్చించుకుని తరలింపుపై ప్రతిపాదన పంపాలంటోంది.
 
తద్వారా హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడుతోంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ తప్పనిసరిగా హైకోర్టు సీజేతో సంప్రదించి మాత్రమే తరలింపు చేపట్టాల్సిన పరిస్దితి. కానీ ఇప్పటికే అమరావతినే రాజధానిగా ప్రకటించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం సవాల్ చేయలేదు. దీంతో హైకోర్టు కూడా తరలింపుపై వెంటనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అసలు ఈ ప్రక్రియ ఇప్పటివరకు మొదలుకాలేదు కూడా.