ప్రజలు ఇచ్చిన తీర్పునకు నితీశ్ ద్రోహం

నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ).. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, సీఎం పదవికి నితీశ్‌ రాజీనామా, ఆ వెంటనే విపక్షాల మద్దతుతో గవర్నర్‌ అనుమతులతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన, బుధవారం సాయంత్రం సీఎంగా ప్రమాణం చేస్తారనే ధృవీకరణ.. ఒకదాని వెంట ఒకటి శరవేగంగా మంగళవారం జరిగిపోయాయి.
 
నితీశ్‌ కుమార్‌ చేసింది ముమ్మాటికీ మోసమేనని, వెన్నుపోటుతో నితీశ్‌ కుమార్‌ రాజకీయ విశ్వసనీయత సైతం కోల్పోయాడని బీజేపీ బలంగా భావిస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో బీహార్‌ ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని అంటోంది. అందుకే తమ అధిష్టానం సైతం ఆయన్ని నిలువరించే ప్రయత్నాలేవీ చేయలేదని చెబుతోంది.
 
 నితీశ్‌ కుమార్‌కి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆరాటంతో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎన్డీయేకి దూరంగా జరిగి ఉండొచ్చు అని బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత చెప్తున్నారు.
 
జేడీయూ-ఎన్‌డీఏ పొత్తు రాబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, నితీశ్‌ కుమార్‌ సీఎం అభ్యర్థిగా ఉంటారని స్వయంగా అమిత్‌ షా ప్రకటించారు. అయినా నితీశ్‌ కుమార్‌ మాత్రం కూటమి నుంచి వైదొలగాలనే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నితీశ్‌కు, జేడీయూ కీలక నేతలకు అమిత్‌ షా ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం.
 
ప్రజలు ఇచ్చిన తీర్పునకు నితీశ్ ద్రోహం చేశారని బీజేపీ మండిపడింది. బీహార్ జనం నితీశ్‌‌కు గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హెచ్చరించారు. ‘‘తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. మేం ఆయనను సీఎంను చేశాం. కానీ ఆయన ప్రజలను రెండుసార్లు మోసం చేశారు. అతను ‘అహంకారం’  అనే వ్యాధితో బాధపడుతున్నా డు” అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 ఆర్జేడీతో నితీశ్ జట్టు కట్టడంపై స్పందిస్తూ.. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని ఎద్దేవా చేశారు. బీహార్ బీజేపీ కోర్ గ్రూప్ నేతలు మంగళవారం పాట్నాలో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న సుశీల్ మోడీ, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, అశ్విని చౌబే, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాట్నాకు వెళ్లారు.
 
కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సంకీర్ణ ధర్మం బీజేపీ ఏనాడూ తప్పబోదని స్పష్టం చేశారు. తక్కువ సీట్లు ఉన్నా ఆయన్ని(నితీశ్‌ను ఉద్దేశిస్తూ) సీఎంను చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఆయనవి ఉత్త అనుమానాలే అని కుట్ర కోణాల ప్రచారాన్ని కొట్టిపారేశారు. 
 
ఇక తాజా పరిణామంపై బీహార్‌ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ తీవ్రంగా స్పందించారు. “2020 ఎన్నికలలో ఎన్డీయే హయాంలో జెడియు- బిజెపిలు కలిసి పోరాడం. మేం ఎక్కువ సీట్లు గెల్చుకున్నా.. నితీష్ కుమార్‌ను సీఎం చేశాం. ఈరోజు ఏం జరిగినా అది బీహార్ ప్రజలకు, బీజేపీకి నితీశ్‌ చేసిన ద్రోహమే” అని ఆయన ధ్వజమెత్తారు.
 
ఈరోజు మళ్లీ కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ – నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఐదోసారి బీహార్ ప్రజల ఆదేశాన్ని అవమానించారని లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్  మండిపడ్డారు. “బీహార్‌లో తాజా రాజకీయ వాతావరణం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత ఆశయాలకు ముందు ఏదీ లెక్కలేకుండా పోయింది. బీహార్ కొన్ని సంవత్సరాల వ్యవధిలో మూడు పొత్తుల ద్వారా వెళ్ళింది” అని గుర్తు చేశారు. 
 
“నితీశ్‌ కంసుడి లాంటోడు. కంసుడు తన మేనల్లులను తానే చంపించాడు. జార్జ్‌ ఫెర్నాండెజ్‌, ప్రశాంత్‌ కిషోర్‌, ఉపేంద్ర కుష్వాహలను వెన్నుపోటు పొడిచాడు నితీశ్‌. నితీశ్ అహంకారం వ‌ల్ల బీహార్ చాలా న‌ష్ట‌పోయింది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లే ల‌క్ష్యంగా నితీశ్‌కు పెద్ద పెద్ద కోరిక‌లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. నితీశ్‌ విలువల్లేనోడు. నితీశ్‌​ నుంచి ఇలాంటిది ముందే ఊహించాం” అంటూ విమర్శించారు. 
 
తాను  బీజేపీతోనే కొనసాగుతామని రాష్ట్రీయ లోక్‌‌ జనశక్తి పార్టీ నేత, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ స్పష్టం చేయగా, ఎల్జేపీ ప్రస్తుత అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మాత్రం.. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.
 
2000 మార్చిలో నితీశ్​ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్‌‌‌‌లో, 2010 నవంబర్‌‌‌‌ లో 2015 ఫిబ్రవరిలో, 2015 నవంబ ర్‌‌‌‌లో 2017, జులైలో 2020 నవంబర్‌‌‌‌లో ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం 8వ సారి బాధ్యతలు చేపట్టనున్నారు. 8 ఏండ్ల​లో 4 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు.
 
2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్డీయే నుండి నితీశ్ కుమార్ వైదొలిగారు. నాడు బిజెపి నరేంద్ర మోదీని ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కూటమి నుంచి బయటికి వచ్చారు. ఆర్జేడీతో జతకట్టారు. 2015 ఎన్నికల్లో గెలిచారు కూడా. కానీ కొన్నాళ్లకే ఆర్జేడీతో విభేదించి 2017లో మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు.
 
 మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేశారు. అధికారాన్ని నిలబెట్టుకు న్నా.. సీట్లు భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో తనను బలహీనపరి చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారు.