18 మంత్రులతో షిండే మంత్రివర్గ విస్తరణ

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేబినెట్ విస్తరణ  పూర్తయ్యింది. ముంబైలోని రాజ్‌భవన్‌ లో అట్టహసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ  సమక్షంలో 18 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 9 మంది శివసేనషిండే వర్గానికి చెందినవారు. కాగా మరో 9 మంది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు.
వేడుకగా ముగిసిన ఈ కార్యక్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీల సంకీర్ణ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిన అనంతరం జూన్ 30న సీఎంగా షిండే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
 
బీజేపీ తరపున కేబినెట్ మంత్రి పదవులు పొందిన 9 మందిలో చంద్రకాంత్ పాటిల్, విజయ్ కుమార్ గావిట్, సుధీర్ ముంగంటివర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖండే, రాధాక్రిష్ణ విఖే పాటిల్, రవీంద్ర చౌహాన్, మంగల్ ప్రభాత్ లోధా, అతుల్ సావే ఉన్నారు. చంద్రకాంత్ పాటిల్ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక 2019లో బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గావిట్‌ కు కూడా మంత్రి పదవి దక్కడం గమనార్హం.
ఇక శివసేన ఏక్‌నాథ్ షిండే శిబిరంలో పదవులు వరించినవారిలో దాదా భూసే, సందీపన్, భూమ్రే, ఉదయ్ సామంత్, తనాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కెసర్కర్, గులాబ్రవో పాటిల్, సంజయ్ రాథోడ్, షాంభూరాజే దేశాయ్ ఉన్నారు. షిండేకి సన్నిహితుడైన దాదా బూసే గత మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక రత్నిగిరికి చెందిన ఎమ్మెల్యే ఉదయ్ సావంత్ మాజీ ఎన్‌సీపీ నేత  కావడం గమనార్హం.