ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో సిపిఎం మేయర్ … కేరళలో రాజకీయ దుమారం

ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో సిపిఎంకు చెందిన మేయర్ పాల్గొనడం కేరళలో రాజకీయ దుమారం రేపుతున్నది. కోజికోడ్ మేయర్ బీనా ఫిలిప్ రాబోయే శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన `బాలగోకులం’ కార్యక్రమంలో పాల్గొనడం అధికార సీపీఎం-బీజేపీ మధ్య బంధాన్ని చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంతో కేరళలో దుమారం రేగింది.

మేయర్ ఫిలిప్ ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోని బాలగోకులం కార్యక్రమంలో పాల్గొని కేరళ కంటే ఉత్తర భారతీయులు పిల్లలను బాగా చూసుకుంటారని కొనియాడారు. పిల్లలను బాల కృష్ణుని వలే ఎప్పుడు నిందలకు గురిచేయకుండా ప్రేమగా చూసుకోవాలని, అప్పుడే బాగా వృద్ధిలోకి వస్తారని తెలిపారు. 
 
ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడం వివాదానికి దారితీసినందున, అధికార సీపీఎం మేయర్‌ను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.  ఆమె ప్రకటన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

“కోజికోడ్‌ కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ బీనా ఫిలిప్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోని ఓ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చేసిన ప్రసంగం సరికాదు. ఆ ప్రత్యేక అంశం పట్ల మేయర్‌ వైఖరి ఆ పార్టీ వైఖరికి పూర్తిగా విరుద్ధం. సీపీఎందీన్ని అస్సలు అంగీకరించదు. మేయర్ వైఖరిని బహిరంగంగా ఖండించాలని పార్టీ నిర్ణయించింది” అని  ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

 
ఆర్ఎస్ఎస్ సమావేశంలో మేయర్ ప్రసంగం తమకు ఆమోదయోగ్యం కాదని, సిపిఎం విధానాలకు వ్యతిరేకంగా ఉన్నదని పార్టీ జిల్లా కార్యదర్శి పి మోహనన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, మీడియాను కలిసిన మేయర్ దురుద్దేశంతో తన ప్రకటనలను సవరించారని విమర్శించారు. ఒక తల్లిగా, మాతృమూర్తుల సమావేశానికి హాజరయ్యానని తెలిపారు. మరోవంక, ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తన లెఫ్ట్ గుర్తింపును కోల్పోయిందని, ఆ ఫ్రంట్‌లోని మిత్రపక్షాలు కూడా ఇటువంటి పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నాయని విమర్శించారు.

“సీపీఎం ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉంది? నేను స్వామి వివేకానందపై పుస్తకాన్ని విడుదల చేసినప్పుడు నా పాత ఫోటోను తీసి ఇటీవల వారు పెద్ద ఇష్యూ చేశారు. అలాంటి కార్యక్రమానికి హాజరు కాకుండా తమ పార్టీ ఎవరినీ నిషేధించలేదని మేయర్ అన్నారు. అంటే ఆమె పార్టీకి తెలియకుండానే ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అర్థం” అని సతీశన్ విస్మయం వ్యక్తం చేశారు.

“శిశు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉందంటే పిల్లల సంరక్షణ ఇక్కడ బాగా ఉన్నట్లుఅర్థం కాదు. అందుకోసం మనం మన పిల్లలను ఉత్తర భారతీయులలా ప్రేమించడం నేర్చుకోవాలి” అని మేయర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేరళీయులు తమ సొంత పిల్లలపై స్వార్థపరులని, ఇతర పిల్లలను భిన్నంగా చూస్తారని, అయితే ఉత్తర భారతదేశంలో ప్రతి బిడ్డను సమానంగా చూస్తారని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ వివాదాన్ని సృష్టించారని బీజేపీ జిల్లా నాయకుడు ఒకరు మండిపడ్డారు.