కామన్వెల్త్‌ గేమ్స్ చివరి రోజు భారతకు పథకాల వర్షం

కామన్వెల్త్‌ గేమ్స్ చివరి రోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు. కనక వర్షం కురిపించారు. ఈ గేమ్స్‌లో మొత్తంగా 61 పతకాలు గెలుచుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

పదోరోజు ఆరు స్వర్ణాలు గెలుపొందితే, క్రీడల ఆఖరి రోజు సోమవారం నాలుగు పసిడి పతకాలు సాధించారు. పురుషుల హాకీలో మన్‌ప్రీత్‌ సేన రజత పతకంతో ప్రతిష్ఠాత్మక గేమ్స్‌కు ముగింపునిచ్చింది. చివరి రోజు బ్యాడ్మింటన్ సింగిల్స్ మహిళల విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ విజయాలు సాధించి దేశానికి రెండు స్వర్ణాలు అందించారు.

ఆ తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి ఇంగ్లండ్ ద్వయం బెన్ లెన్-సీన్‌ వెండీలపై 21-15, 21-13తో విజయం సాధించి బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. 

ఇక పురుషుల టిటి సింగిల్స్ విభాగంలో అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత ఆటగాడు జ్ఞానశేఖరన్ సాతియాన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 

ఫలితంగా 22 స్వర్ణాలతో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టేసిన భారత్.. నాలుగో స్థానానికి ఎగబాకింది. మలేషియాకు టిజే యోంగ్‌తో జరిగిన స్వర్ణ పతక పోరులో తొలి సెట్‌ను 19-21తో ఓడిపోయిన లక్ష్యసేన్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. 

రెండో సెట్‌లోనూ తొలుత 8-9తో వెనకబడినప్పటికీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 21-9తో చేజిక్కించుకున్నాడు. మూడో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించి 21-16తో స్టన్నింగ్ విక్టరీ సాధించి దేశానికి మరో స్వర్ణం అందించాడు. 

ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన 20 ఏళ్ల లక్ష్యసేన్ తాజా విజయంతో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన ప్రకాశ్ పదుకొనే (1978), పారుపల్లి కశ్యప్ (2014), సయ్యద్ మోదీ (1982) సరసన చేరాడు.

పురుషుల టేబుల్ టెన్నిస్‌లో 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌తో 4-1తో విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు. అంతకుముందు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్‌ కమల్‌కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. కమల్‌ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్‌ టెన్నిస్‌ నేర్చుకుందీ.. అనంతరం కోచ్‌గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది.

అలాగే, టేబుల్ టెన్నిస్‌లోనే భారత్‌కు కాంస్య పతకం లభించింది. మూడో స్థానం కోసం ఇంగ్లండ్ ఆటగాడు పాల్ డ్రింక్‌హాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ సాతియాన్ విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్నాడు.

ఇక, పురుషుల హాకీ ఫైనల్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత్ పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ 0-8 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో భారత్ రజతంతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. మరోవైపు, భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాకు కామన్వెల్త్‌లో ఇది వరుసగా ఏడో పతకం కావడం గమనార్హం.

పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా 8-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వరుస గోల్స్‌తో భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ అలవోక విజయాన్ని అందుకుంది. ఇక మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం దక్కిన విషయం తెలిసిందే.