బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

కొద్దీ రోజులుగా జరుగుతున్న రాజకీయ అనిశ్చితకు  ముగింపు పలుకుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తన  పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఎనిమిది ఏళ్లలో బిజెపితో తెగతెంపులు చేసుకోవడం ఆయనకు ఇది రెండోసారి.

రాజీనామా అనంతరం నితీష్‌ కుమార్‌ మీడియాతో​ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చామని తెలిపారు.  జేడీయూను విడదీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెలిపారు.

రాజీనామా చేశాక నితీశ్ కుమార్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి ఇంటికి చేరారు. అప్పటికే రబ్రీ నివాసానికి ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యేలు, నేతలు చేరుకున్నారు. జేడియూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్‌తో కలిసి నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. 

ఇలా ఉండగా, నితీష్  నిర్ణయంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నితీష్ కుమార్ స్పందిస్తూ ఇది ప్రజా తీర్పుకు ద్రోహంగా అభివర్ణించారు. “2020 ఎన్నికలలో మేము కలసి ఎన్డీయేగా పోటీ చేసాము. బిజెపి –  జేడీయూ ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. మాకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్ కు  ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చాము. ఈరోజు ఏది జరిగినా బీహార్ ప్రజలకు, బిజెపికి ద్రోహం చేయడమే” అంటూ ఘాటుగా విమర్శించారు. 

243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడియూకు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఉదయం పార్టీ ఎమ్యెల్యేలు, ఎంపీలతో భేటీ అయినా నితీష్ కుమార్ అందరూ ఎన్డీయే నుండి వైదొలగాలని ఏకగ్రీవంగా అందరూ నిర్ణయించడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశాక కొంతకాలం నితీశ్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా తేజస్వీ కొనసాగుతారు. 2024 ఎన్నికల సమయానికి విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగాలని నితీశ్ యోచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నితీశ్ విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగితే 2025 వరకూ తేజస్వీ యాదవ్ బీహార్ సీఎంగా కొనసాగుతారని భావిస్తున్నారు.

బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌  బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మి నుండి నిష్క్రమించారు.