తైవాన్‌ రక్షణ శాఖ కీలక అధికారి అనుమానాస్పద మృతి

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా ఆ ద్వీప దేశం చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన అభివృద్ధి విభాగం హెడ్ గా పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్ లో మరణించినట్టు గుర్తించారు. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. 
 
యాంగ్ లీషింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం గమనార్హం. పలు క్షిపణుల తయారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. చైనా ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో తైవాన్ మిలిటరీ సారధ్యంలో పనిచేసే ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
 
ఈ ఏడాది చివరి నాటికి 500 మిసైళ్లను ఉత్పత్తి చేయాలనుకుంటోంది. యుద్ధ సామర్థ్యాలను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా క్షిపణుల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. ఇందుకుతగ్గట్టే ఎస్‌సీఎస్ఐఎస్‌టీ ప్రస్తుతం దక్షిణ తైవాన్‌లోని జిపెంగ్ మిలిటరీ ఫెసిలిటీలో క్షిపణులను వరసగా పరీక్షిస్తోందని ‘జెరూసలేం పోస్ట్’ కథనం పేర్కొంది. 
 
ఈ మిసైళ్లు 7,620 మీటర్ల ఎత్తువరకు చేరుకోగలుగుతున్నట్టు తొలి మూడు రౌండ్లలో తెలిసిందని పేర్కొంది. పింగ్‌తుంగ్ కౌంటీలోని జిపెంగ్ మిలిటరీ బేస్‌లో ఆగస్టు 3న ఈ ప్రయోగాలు మొదలవ్వగా.. ఆగస్టు 18న ముగియనున్నాయని వెల్లడించింది. సముద్ర తీరంలో డేంజర్ జోన్‌‌ తప్పించేందుకుగానూ విమానాలు, నౌకలను తైవాన్ ఉపయోగిస్తోందని వివరించింది.
 
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటించిందన్న అక్కసుతో చైనా తీవ్రస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది.  తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేపట్టి ఆ చిన్న ద్వీపదేశాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించింది. చైనా చేపట్టింది సైనిక విన్యాసాలుగా తాము భావించడంలేదని, అవి తైవాన్ భూభాగంపై దాడికి సన్నాహాలుగా భావిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. 
 
చైనా సైనిక విన్యాసాలు తమ స్వయంపాలిత ద్వీపంపై యుద్ధం జరుగుతున్న భావనను సృష్టిస్తున్నాయని తైవాన్ ఆరోపించింది. చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మీడియన్ లైన్‌ను అతిక్రమించినట్లు తెలిపింది. ఈ ద్వీపంలో వైమానిక, నావికా దళం గస్తీని పెంచింది. భూమిపైగల క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసింది. 
 
తైవాన్ జలసంధి ప్రాంతంలో అనేక చైనా విమానాలు, నౌకలను తాము గమనించామని, తైవాన్ ప్రధాన భూభాగంపై ఎలా దాడి జరపాలన్నదానిపై అవి ముందస్తు సన్నాహాలు చేశాయని నమ్ముతున్నామని వెల్లడించింది. చైనా విమానాలు, నౌకల్లో కొన్ని మధ్యస్థ రేఖను కూడా దాటాయని ఆరోపించింది.
 
తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, తైవాన్ రక్షణ దళాలు అప్రమత్తమైనట్లు తెలిపింది. ఈ ద్వీపంలో గగనతలం, సముద్ర ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేసినట్లు తెలిపింది. అవసరమైనపుడు స్పందించేవిధంగా భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, తైవాన్ సైన్యం శనివారం నాలుగు మానవ రహిత గగనతల వాహనాలను (డ్రోన్లను) కిన్‌మెన్ ప్రాంతంలో గుర్తించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ డ్రోన్లు చైనాకు చెందినవేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ డ్రోన్లను గమనించి, హెచ్చరిస్తూ తైవాన్ సైన్యం కాల్పులు జరిపినట్లు పేర్కొంది. 
 
తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ ఇ చ్చిన ఓ ట్వీట్‌లో, చైనా సైనిక విన్యాసాలు, సమాచార యుద్ధ కార్యకలాపాలను తమ ప్రభుత్వం, సైన్యం నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామిక తైవాన్‌కు మద్దతివ్వాలని, ప్రాంతీయ భద్రత పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఆపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.