స్వదేశీ యుద్ద విమానంలో ప్రయాణించిన వాయుసేన చీఫ్

భారత దేశంలో తయారైన యుద్ధ విమానంలో భారత వాయుసేన  అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రయాణించారు. ఈ విమానాన్ని భారత వాయు సేనలో ప్రవేశపెట్టే ముందు ఆయన దీనిని సమీక్షిస్తున్నారు. ఆదివారం కూడా ఆయన బెంగళూరులో పర్యటిస్తారు.
భారత దేశంలో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్‌లో వీఆర్ చౌదరి శనివారం ప్రయాణించారు. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, వీఆర్ చౌదరి బెంగళూరులో రెండు రోజులపాటు పర్యటిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారత్) పథకంలో భాగంగా స్వదేశంలో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే1 తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్, హెచ్‌టీటీ-40లను ఆయన పరీక్షిస్తారు.
వీటిని త్వరలో భారత వాయుసేనలోకి ప్రవేశపెడతారు. స్వయం సమృద్ధ భారత దేశం  పథకం దిశగా ఐఏఎఫ్ చేస్తున్న కృషిలో ఇది భాగం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మేక్ ఇన్ ఇండియా () పథకంలో భాగంగా మన దేశంలోనే 96 అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయాలని భారత వాయు సేన ప్రణాళికలు రచించింది.
దీని కోసం అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 70 శాతాన్ని భారతీయ కరెన్సీ రూపంలోనే చెల్లించబోతున్నారు. 36 విమానాలకు కొంత సొమ్ము భారతీయ కరెన్సీలోనూ, కొంత సొమ్ము విదేశీ కరెన్సీలోనూ చెల్లిస్తారు. 60 విమానాలకు పూర్తిగా మన దేశ కరెన్సీలోనే చెల్లిస్తారు.