మధ్యప్రదేశ్‌లో సమస్యల్లో చిక్కుకున్న నేషనల్‌ హెరాల్డ్‌

మధ్యప్రదేశ్‌లో నేషనల్‌ హెరాల్డ్‌ సమస్యల్లో చిక్కుకుంది. రాష్ట్రంలోని నేషనల్‌ హెరాల్డ్‌ చెందిన ఆస్తులకు సంబంధించి అక్కడి బిజెపి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టనుంది. 

ఇక్కడ నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌ పేపర్‌కు చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా..?వాటిని కమర్షియల్‌ అవసరాల కోసం వాడుతున్నారా? ఆ భూమి వినియోగంలో ఏవైనా మార్పులు జరిగాయా? వంటి అంశాలపై విచారిస్తామని రాష్ట్ర పట్టణ అభివఅద్ధి శాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌ తెలిపారు. 

నేషనల్‌ హెరాల్డ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఆ సంస్థ ఆస్తులపై విచారణకు ఆదేశించింది. 

సంస్థకు చెందిన దర్యాప్తు చేస్తామని, వీటిని కమర్షియల్‌ అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు తేలితే, వాటిని సీజ్‌ చేస్తామని తెలిపారు. తొలుత ఆ భూములను స్వాతంత్య్ర సమర యోధుల పేరిట కేటాయించారని, ఆ తర్వాత వాటిని కాంగ్రెస్‌ నేతల పేరిటకు మార్చారని చెప్పారు. 

ఢిల్లీలో నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన సుమారు రూ. 5000 కోట్ల ఆస్తులను సోనియా గాంధీ పేరిట మార్చినట్టుగానే ఇక్కడ కూడా మార్పులు జరిగాయని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌ పేపర్‌ను పబ్లిష్‌ చేసే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు భోపాల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రెస్‌ కాంప్లెక్స్‌లోని 1.14 ఎకరాలను రూ. 1 లక్షకు 1982లో లీజుకు ఇచ్చింది. 

ఈ లీజు 2011తో ముగిసింది. ఈ భూమి దగ్గరకు భోపాల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు వెళ్లి చూడగా అక్కడ అక్రమాలు కనిపించినట్టు తెలిసింది. న్యూస్‌ పేపర్‌ కోసం ఆ భూములు వినియోగించకుండా కమర్సియల్‌ అవసరాల కోసం వాడుతున్నట్టు అధికారులు కనుగొన్నారు.