టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్

టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్
టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే విధంగా శరవేగంగా ముందుకెళుతోంది. అందులో భాంగానే జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్  విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత వారం స్వయంగా వెల్లడించారు. 
 
ఈ విధానం అమలులోకి వస్తే  హైవేలపై ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలకు మంగళం పాడి, ఆ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం గతేడాదే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు వడివడిగా అడుగులేస్తోంది.
 
ఈ విధానం అమల్లోకి వస్తే ఫాస్ట్ టాగ్   కూడా కనుమరుగు కానుంది. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానంలో టోల్ ఎలా వసూలు చేస్తారంటే ఉదాహరణకు హైవేపై ఒక కారు ప్రయాణం చేస్తుంటే, ఆ హైవేపై ఆ కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిందో అన్ని కిలోమీటర్లకు టోల్‌ను వసూలు చేస్తారు. అంటే,కారు ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్కువ టోల్ ఫీజు, తక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే తక్కువ టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. 
 
కొన్ని సందర్భాల్లో హైవేపై ప్రయాణించే దూరం తక్కువే అయినప్పటికీ ఎక్కువ టోల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అలాంటి వారికి ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం మేలు చేస్తుంది. ఈ విధానం ద్వారా కారు హైవేపై/ఎక్స్‌ప్రెస్‌వేపైకి రాగానే ఇన్‌స్టాల్ చేసిన జీపీఎస్ ట్రాకర్ ప్రయాణించే కిలోమీటర్లను లెక్కగట్టడం మొదలు పెడుతుంది.
 
కారు ఆ హైవేపై నుంచి దిగిపోగానే ఆటోమేటిక్‌గా అప్పటివరకూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో అన్ని కిలోమీటర్లకు టోల్ అమౌంట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద  వారి ఖాతాల నుండి జమ అవుతుంది.  ఈ విధానంలో భాగంగా వాహన యజమానులు తమ వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
అంతేకాదు.. వాహనదారుడి పేరు, అడ్రస్, వెహికల్ మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంకు వివరాలను రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో స్పష్టత రానిది ఏంటంటే.. టోల్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి తగ్గిస్తారో  లేదా ఏదైనా ప్రత్యేక ఆన్‌లైన్ వ్యాలెట్‌లో యాడ్ చేసుకున్నాక ఆ ఛార్జీలు తగ్గిస్తారో తెలియవలసి ఉంది. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం ఐరోపా ఇప్పటికే  దేశాల్లో అమలులో ఉంది.