5జీ వచ్చినా అందరికీ అందుబాటులోనే టెలికాం ధరలు

ఈ ఏడాది అక్టోబరు నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5జీ వచ్చినప్పటికీ మన దేశ టెలికాం రంగం ప్రపంచంలో అత్యంత అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన పరికరాలను అమర్చే ప్రక్రియను ప్రారంభించాలని పరిశ్రమ వర్గాలను కోరినట్లు తెలిపారు. 
5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తయింది. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వచ్చింది. ఈ వేలం విజయవంతమైందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు టెలికాం ఆపరేటర్లకు కూడా లాభదాయకంగానే ఉందని కొందరు చెప్తున్నారు. రిజర్వు ధరల కన్నా ఎక్కువ బిడ్డింగ్ చేయకుండానే 5జీ స్పెక్ట్రమ్‌ను వారు పొందగలిగారని అంటున్నారు.
ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత దేశంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడానికి మార్గం సుగమం అయింది. ఇదిలావుండగా, మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ, గతంలో 2జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆరోపణలు ఎదుర్కొన్న నేత ఏ రాజా 5జీ స్పెక్ట్రమ్ వేలం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం సంభవించిందని ఆరోపించారు.
ఈ వేలం వల్ల రూ.5 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారని, ఇప్పుడు కేవలం రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఈ వేలంలో భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అయితే,  రాజా చేసిన ఆరోపణలను అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. మాజీ మంత్రి ఈ విధంగా మాట్లాడటంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.
 చాలా బ్యాండ్లను అమ్మలేదని, అమ్ముడుపోని బ్యాండ్లు ప్రభుత్వం వద్దనే ఉన్నాయని తెలిపారు. ఇది కుంభకోణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రూ.1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ అమ్ముడుపోయిందని, రూ.2,81,432 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ప్రభుత్వం వద్ద ఉందని వైష్ణవ  చెప్పారు. 600 మెగా హెర్ట్జ్, 2,300 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ అమ్ముడుపోలేదని తెలిపారు.
ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తయిందని, స్పెక్ట్రమ్ కేటాయింపులకు ఆమోదం తెలపడం కోసం తమ కమిటీ సమావేశమైందని చెప్పారు. ఆగస్టు 10 నాటికి స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామని చెప్పారు  5జీ సేవలను అక్టోబరులో ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యంత అందుబాటులో ఉండేది భారతీయ టెలికాం మార్కెట్ అని, 5జీతో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల హాని జరుగుతుందనే వార్తలను  కేంద్ర మంత్రి తోసిపుచ్చారు.
అమెరికా, యూరోప్‌లలో వెలువడే రేడియేషన్ కన్నా మన దేశంలో వెలువడే రేడియేషన్ 10 రెట్లు తక్కువ అని చెప్పారు. తక్కువ రేడియేషన్ అంటే మనం మంచి నాణ్యమైన సేవలను అందజేయగలిగే సామర్థ్యాన్ని కలిగియున్నామని అర్థమని చెప్పారు. మనకు సురక్షితమైన, భద్రతగల వాతావరణం ఉందని స్పష్టం చేశారు.