తైవాన్ జలసంధిపై మిస్సైళ్ల‌ను ప్ర‌యోగించిన చైనా

అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం  తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది.
తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్లిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది. 
 ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్‌ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్‌ జోన్‌లో సరకు రవాణాకు  గండిపడే అవకాశాలున్నాయి.

దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది.  టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది. 

గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతుండగా,  గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్‌ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ విన్యాసంగా  పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది.  చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్ తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. 

ఇది ఇష్టం లేని చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతోంది. యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తర్వాత డ్రాగన్ కంట్రీ చర్యలు మరింత ముమ్మరం చేసింది. వివిధ కారణాలతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది.

తాత్కాలికంగా ఈ జలసంధిలో రవాణా నిలిచిపోతే జపాన్, దక్షిణ కొరియాపై అత్యధిక ప్రభావం పడుతుంది.  గురువారం నాటి విన్యాసాలతో నౌకల రవాణా సూచీ 4.6% నుంచి 1.05%కి  పడిపోయింది.  చైనా మిలటరీ విన్యాసాలతో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నౌకలు ప్రయాణించవద్దని ఇప్పటికే తైవాన్‌ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది.

తైవాన్‌ జలసంధి నుంచి ఫిలిప్పీన్స్‌ సముద్రం వైపు నౌకలను మళ్లించాలన్నా భారీగా కురుస్తున్న వర్షాలతో ఆటంకాలున్నాయి.  చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.