టీఆర్ఎస్ లో మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

టీఆర్ఎస్ నుంచి  కనీసం 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని చెబుతూ ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన తెలిపారు. 
 
కాగా, తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుండి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వే సంస్థలు నివేదికల్లో వెల్లడైందని సంజయ్ చెప్పారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత పెరగబోతోందని, తద్వారా బీజేపీకి సీట్లు, ఓట్ల శాతం మరింతగా పెరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
 
ప్రస్తుతం ఎమ్యెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా ప్రకటించడంతో త్వరలో మునుగోడుకు ఉపఎన్నిక  జరుగనున్న నేపథ్యంలో అదే తరహాలోనే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. అందులో భాగంగా తమ తమ నియోజకవర్గ ప్రజల చేత ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోతున్నారని చెప్పారు. 
 
ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజు సందర్భంగా మాట్లాడుతూ చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని సంజయ్ ఆరోపించారు. నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని ఆయన హెచ్చరించారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన సంజయ్ ఈ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతోందని తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని, అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. 
 
బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే కుట్రకు మళ్లీ తెరలేపారని ఆయన ఆరోపించారు.  డ్రగ్స్ స్కామ్ లో ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేసింది ఆ తర్వాత డ్రగ్స్ స్కామ్ ను ఏం చేసిందో, ఎలా నీరు గార్చిందో మనం చూశామని చెబుతూ చీకోటి క్యాసినో వ్యవహారం కూడా అంతే అని చెప్పారు.  బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెబుతూ అర్హులైన పేదలను గుర్తించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.
  “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన”కు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ ఇమ్మంటే… ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ ఆ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.7 లక్షలకు పైగా ఇండ్లు మంజూరు చేయడంతో పాటు దాదాపు 4 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులకు లెక్కలు చూపలేదని, పైగా నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు.  
 
డబుల్ బెడ్రూం పేరుతో కట్టించిన ఇండ్లు 8 వేల మాత్రమే అంటూ తెలంగాణ కు కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కూడా కట్టించలేని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.