శ్రీ రాముడి చరిత్ర సామాన్యులకు అందించిన సంత్ తులసీదాస్

* నేడు తులసీ దాస్ జయంతి 

తులసీదాస్ (1532 – 1623) భారతదేశంలోని హిందూ సాధువులలో గొప్పవారిలో ఒకరు. తులసీదాస్ శ్రీరామునికి గొప్ప భక్తుడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన “శ్రీరామ చరిత్ మానస్” అని పిలువబడే శ్రీరాముని పురాణ గాధను సామాన్య ప్రజలకు అందించిన ఆయన హిందూ ధర్మంలో భక్తి స్థితికి అత్యుత్తములుగా ప్రసిద్ధి పొందారు.  శ్రీరాముడు, శ్రీ లక్ష్మణుడు కొన్ని సందర్భాలలో తులసీదాసుకు ప్రత్యక్షంగా కనిపించారని చెబుతారు. 
 
 తులసీదాస్ కథ ప్రస్తుత యుగంలో ఔత్సాహికులకు అత్యంత స్ఫూర్తిదాయకం. అది భగవంతునిపై విశ్వాసాన్ని పునరుజ్జీవింప చేస్తుంది.  ఈ కలియుగంలో కూడా స్వచ్ఛమైన భక్తి ద్వారా భగవంతుడిని పొందవచ్చని రుజువు చేస్తుంది. హిందీ భాషలో అత్యుత్తమ కవులలో ఒకనిగా నిలిచారు. ఆయన రచనలు, కళారంగ సేవలు భారతదేశ సంస్కృతిపై,  సమాజంపై విశేష ప్రభావం చూపాయి.
 
ఆయన రచనల నుండే నేడు రామ గాథలు, నాటకాలు , హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం , పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు అనేకం విలసిల్లాయి. ఆయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలి కవి. 
 
అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్‌ చాలీసాను కూడా రచించారు. విశేషం ఏమిటంటే ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతటా ఏ ప్రాంత, ఏ రాష్ట్రప్రజలైనా కూడా *”హనుమాన్ చాలీసా”* ను అన్ని భాషలవారూ పరమభక్తితో పఠిస్తారు.
ఆయన అభినవ వాల్మీకి , భక్తశిరోమణి  బిరుదులతో ప్రసిద్ధి చెందారు.  రామచరిత మానస్ , వినయపత్రిక , దోహావళి , కవితావళి , హనుమాన్ చాలీసా , వైరాగ్య సందీపని , జానకీ మంగళ్ , పార్వతీ మంగళ్ వంటి రచనలు చేశారు.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో 1532లో ఆత్మారాం దుబే, హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి , కావ్య రచన, తాదాత్మ్యత , భాష – వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. 
 
 తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి , తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు.
 
ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తి కావడానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు. ఆయన తదనంతరం వారణాసిలో *”తులసీ ఘాట్”* ఏర్పడింది.
తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి , గీతావళి , వినయ పీఠిక , జానకీ మంగళ్‌ , రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న , పార్వతి మంగళ్‌ , కృష్ణ గీతావళి , హుమాన్‌ బాహుక , సంకట మోచనస వైరాగ్య సందీపిని , హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.
 
తులసీదాసు వారణాసిలో సంకటమోచన్‌ దేవాలయాన్ని కట్టించాడు. దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది. తులసీదాసు తండ్రి ఆత్మారాముడు , తల్లి హులసీలకు తులసీదాసు జన్మించినప్పుడు అయిదు సంవత్సరాల బాలకుడివలే కనిపించాడట.
 
తల్లితండ్రులాతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటిదాసి మునియాకు పెంచుకొనుటకు ఇచ్చారు. పైగా, మూలా నక్షత్రమందు జన్మించుటవలన అరిష్ట సూచకంగా భావించి త్యజించినట్లు వదంతి కూడా ఉంది. తల్లితండ్రులచే అతడు త్యజించినట్లు తెలియుచున్నది. జనిక జననీతజ్యో జనమి – జన్మిచగనే జననీ జనకులు త్యజించిరి – అని తులసీదాసు ఒకచోట వ్రాసాడు. తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియాదాసి కూడా చనిపోయింది.
 
అపుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య వేర్పారు. తరువాత శేషసనాతనుడనే శ్రేష్ఠునివద్ద తులసీదాసు వేద, వేదాంగములు అభ్యసించాడు. తులసీ దాస్ అనాథబాలుడైనను ఆతని రూప, గుణ , శీల , స్వభావ , విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణ డాతనికి తన కన్యనిచ్చి వివాహం చేశాడు.
 
 తులసీదాసు మహా రసికుడు. తన భార్యయైన రత్నావళి యందు ఆద్యంత అనురక్తుడుగా ఉండేవాడు. అయితే ఒకనాడు తానింటివద్ద లేని సమయంలో అతని భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈ వార్త తెలియగానే భార్య ఎడబాటును సహించలేక తులసీదాసు ఆమెను చేరుకొనుటకు బయలుదేరాడు. నిబిఢాంధకారమైన ఆ రాత్రి , దానికి తోడు కుంభవృష్టి పడుతూవుంది. 
 
అటువంటి భయంకరమైన రాత్రి సమయంలో అతడు తన భార్య వద్దకు గంగానదిని దాటి చేరుకొన్నాడు. ఆ సమయంలో అతని భార్య రత్నావళి గావించిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చి వేసింది.
 
*అస్థిచర్మమయ దేహ మను తామేజైసీప్రీతి*
*తైసి జో శ్రీరామమహ హోత వతౌభవతి!*
 
నాధా ! అస్థి చర్మమయమైన నాదేహమందున్నంత ప్రీతి ఆ శ్రీరామునియందున్నచో భవభీతియే యుండదు గదా ! 
 
రత్నావళి ఈ గంభీరోక్తి తులసీదాసుకు తారక మంత్రమయింది. అప్పటి నుంచి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. అయోధ్య, కాశీలు తులసీదాసుకు నివాసస్థానాలయ్యాయి. జీవిత చరమదశ యందు కాశీయే నివాస స్థానమయింది. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడై వుండికూడా రామాయణగాధను ప్రజలకందించేందుకు అయోధ్య ప్రాంత ప్రజల భాషయైన అవధీలో వ్రాశాడు.
 
తనపై అతనికి గల తీవ్ర ప్రేమ గురించి తెలుసుకున్న రత్నావళీ ఇలా చెప్పింది. *”నా ప్రాణనాధా ! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. కనుక కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు సహాయ పడుతుంది.”* అంది. 
 
ఈ మాటలు విన్న తులసీదాసు మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్య ప్రేమ గా రూపాంతరం చెందింది. అతడు తక్షణమే బదరీనీ , సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు.
తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఎంత వెదకినా అతని జాడ దొరకలేదు.
 ప్రేమ విశ్వాసాలు గల తులసీదాసు భార్య దిక్కులేనిది అయిన రత్నావళి అన్ని సుఖాలను విసర్జించి చివరి వరకు ఒక వైరాగ్య జీవితాన్ని గడిపింది. బదరి నుండి తులసీదాసు విస్తృతంగా పర్యటించాడు. దేశ దిమ్మరి అయిన ఒక సంగీత పాటకునిగా , కొన్ని సమయాల్లో అద్భుత క్రియలు చేస్తూ జీవితం కొనసాగించాడు తులసీదాసు.
కొంతకాలంపాటు తులసీదాసు చిత్రకూటంలో , అయోధ్యలో నివసించాడు. రాజపూర్‌ను నిర్మించారు. అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే 1623లో తన తనువు చాలించాడు.