అవినీతి పరులను జైల్లో వేసేందుకు బిజెపికి అధికారం ఇవ్వండి 

తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని అవినీతి పరులను జైల్లో వేసేందుకు బిజెపికి అధికారం ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ ప్రజలకు పిలుపిచ్చారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మంగళవారం పవిత్ర క్షేత్రం యాదాద్రి వద్ద నుండి జెండా ఊపి ప్రారంభిస్తూ తాము తెలంగాణాలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడతామని స్పష్టం చేశారు. 
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్ ప్రాజెక్ట్ లో  జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ధ్వజమెత్తుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ (ఏటీఎం) అయిందని ఆరోపించారు.

 
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏ డిజైన్ తో కట్టారు? అని కేసీఆర్ ను ప్రశ్నిస్తూ  ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్ లు మునిగాయని విమర్శించారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని దుయ్యబట్టారు.
అణగారిన కులాలంటే కేసీఆర్ కు గిట్టదని పేర్కొంటూ రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదని,  అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే మద్దతుగా నిలిచాడని గుర్తు చేశారు.

తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలి అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందే అని షెకావత్ పిలుపిచ్చారు.

స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశారని, అదే విధంగా  తెలంగాణ ఉద్యమంలో కూడా అలానే పోరాటం చేసి ప్రాణ త్యాగం చేస్తే… ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో మనం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
 
తెలంగాణలో రాజులా నియంత పాలన కొనసాగిస్తున్నారని, తెలంగాణ ప్రజల కల నెరవేరలేదని తెలిపారు.  తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారో… ఆ కలలు సాకారం కాలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ కేసీఆర్ విను… బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ప్రకటించారు. 
 
తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న కేంద్ర మంత్రి ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని గుర్తు చేశారు.  రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని పేర్కొంటూ కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని భరోసా వ్యక్తం చేశారు. 
దేశాన్ని ఏళ్లుగా పాలించిన వాళ్లు ప్రజలను పట్టించుకోలేదని షెకావత్ చెబుతూ దళితుడైన రాంనాథ్ కోవింద్ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబ హితమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. 
 
మోదీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ఆయన ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని తెలిపారు.  యాదగరిగుట్ట వంగపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది.  కేంద్ర  మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జెండా ఊపి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు.
మొత్తం 24రోజుల పాటు 328 కిలోమీటర్లు సాగే మూడో విడత ప్రజా సంగ్రామయాత్రలో మొదటి రోజు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్ల 10.5 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి,  బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, ఎమ్యెల్యేలు ఈటెల రాజేందర్, ఎన్ రఘునందన్ రావు తదితరులు యాత్ర  ప్రారంభంలో పాల్గొన్నారు.